అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి!

10 Sep, 2018 12:59 IST|Sakshi

మార్కెట్‌ యార్డులో కిలో రూ.4

బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.20 నుంచి రూ.25

దళారులు, వ్యాపారుల దోపిడీ

ధరల నియంత్రణలో అధికారుల విఫలం

కర్నూలు ,(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): ఉల్లికి గిట్టుబాటు ధర లభించక రైతులు రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేస్తుండగా.. మార్కెట్‌లో అదే ఉల్లిని కొనుగోలు చేయలేక వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వ్యాపారుల చేతివాటం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉల్లిని అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చదంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది ఉల్లి దిగుబడి పెరగడంతో ఒక్క సారిగా మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇదే సమయంలో గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించిన రైతుకు ఆదాయం మిగలకపోగా.. పెట్టుబడి చేతికందలేదు. దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. కొద్ది రోజులుగా కర్నూలు మార్కెట్‌ యార్డులో క్వింటం ఉల్లి రూ.400 నుంచి రూ.500 మాత్రమే ఉంది. దీంతో ఒకే రోజులో పడిపోతున్న ధరల వ్యత్యాసాలను జీర్ణించుకోలేక రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు కొకొల్లలు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఉల్లి వినయోగదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.  వ్యాపారులు, దళారులు అధిక ధరలకు ఉల్లిని విక్రయిస్తుండటంతో కొనుగోలు చేయలేకపోతున్నారు. 

మార్కెట్‌ మాయజాలం..
మార్కెట్‌ యార్డులో రైతుల వద్ద కిలో ఉల్లిని రూ.4 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు అదే ఉల్లిని బహిరంగ మార్కెట్లలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. దుకాణదారులకు హోల్‌సేల్‌గా కిలో రూ.15 నుంచి రూ.20 ఇస్తుండగా, వారు రిటైల్‌గా రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని అన్ని హోల్‌సేల్‌ మార్కెట్‌లకు, ప్రధాన పట్టణాలకు ఏడాదిలో కొన్ని నెలల పాటు కర్నూలు యార్డు నుంచే దిగుమతి అవుతాయి. అలాగే మరి కొద్ది రోజులు మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్, అహ్మద్‌నగర్, గోడేగావ్‌ తదితర ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. స్థానిక యార్డులో క్వింటం ఉల్లి  రూ.400 నుంచి రూ.500 వరకు ధర ఉన్న నేపథ్యంలో స్థానిక మార్కెట్లలో మాత్రం వ్యాపారులు ఆ మేర ధరలు తగ్గించిన దాఖలాలు లేవు. ట్రాన్స్‌పోర్టు నిమిత్తం కేజీకి ఒక్క రూపాయి మాత్రమే భారమవుతుండ గా మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ.7 నుంచి రూ.10 వరకు విక్రయించాల్సి ఉంది. అయితే వ్యాపారులు రెట్టింపు ధరకు విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు.  

కొత్త సరుకు.. పాత ధర  
గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు నష్టపోతుండగా వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు. కొత్త సరుకును పాత ధరలకే విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడైన వినియోగదారులు ప్రశ్నిస్తే పాత స్టాక్‌ అంటూ చెబుతూ దోచుకుంటున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ట్రాన్స్‌పోర్టు మినహాయించుకొని ఆ ధరల ఆధారంగానే వినియోగదారులుకు విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. మార్కెట్‌ లో ఉల్లి ధర లొల్లి కొనసాగుతున్నా.. అధికార యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది.  

ధరలను నియంత్రించాలి
ఉల్లికి ధరలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. కొందరు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కెట్లో చూస్తే కిలో ఉల్లి రూ.20కి పైగా ధర పలుకుతోంది. రైతుకు గిట్టుబాటు కాని ధర వ్యాపారి మాత్రం లాభాలను ఆర్జిస్తుంది. అధికారులు చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలి.  రమేష్, ఉపాధ్యాయుడు, కర్నూలు

మరిన్ని వార్తలు