ఉల్లి అ‘ధర’హో

19 Sep, 2019 09:01 IST|Sakshi

ఒక్కరోజులోనే క్వింటాల్‌పై రూ.690 పెరుగుదల

రూ.4 వేలకు చేరిన గరిష్ట ధర 

మరింత పెరిగే అవకాశం 

రైతుల మోములో సంతోషం 

సాక్షి, కర్నూలు: ఉల్లి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో రైతుల్లో సంతోషం కన్పిస్తోంది.  మూడేళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం క్వింటాల్‌ ఉల్లి గరిష్ట ధర రూ.3,310  ఉండగా.. బుధవారం ఒక్కసారిగా రూ.4 వేలకు చేరింది. ఒక్క రోజులోనే రూ.690 పెరగడం విశేషం. అత్యధిక లాట్లకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ధర లభించింది. మూడేళ్లుగా ఉల్లి ధరలు పడిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే లభించింది. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో గత ఏడాది వరకు మూటకట్టుకున్న నష్టాల నుంచి రైతులు బయటపడుతున్నారు.

మహారాష్ట్రలో అతివృష్టి కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బతినడంతో కర్నూలు జిల్లాలో పండించిన పంటకు డిమాండ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఉల్లి అత్యధికంగా పండేది మన జిల్లాలోనే. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో వ్యాపారుల దృష్టి కర్నూలు మార్కెట్‌పై పడింది. వ్యాపారులు భారీగా పోటీ పడుతుండడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం క్వింటాల్‌ రూ.4 వేలకు చేరగా.. ఈ ధర మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ధరలు పెరుగుతుండడంతో మార్కెట్‌కు ఉల్లిగడ్డలు కూడా పోటెత్తుతున్నాయి. మార్కెట్‌యార్డులో కనీసం 20 వేల క్వింటాళ్ల  నిల్వలు ఉన్నాయి.  జిల్లాలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,145 హెక్టార్లు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో 13,235 హెక్టార్లలో సాగైంది. ధరలు పెరుగుతుండడంతో ఇప్పుడు కూడా రైతులు పోటీపడి సాగు చేస్తున్నారు. దీంతో ఉల్లి విత్తనాల ధరలు కూడా  చుక్కలనంటుతున్నాయి. 

పెరుగుతున్న ధరలు ఊరటనిస్తున్నాయి
గత ఏడాది వరకు ఉల్లి సాగు చేసి నష్టాలు మూట కట్టుకున్నాం. ఇప్పుడు ధరలు పెరుగుతుండడంతో నష్టాల నుంచి బయటపడుతున్నాం.  మేము కర్నూలు మార్కెట్‌కు 40క్వింటాళ్లకు పైగా ఉల్లి తెచ్చాం. క్వింటాల్‌కు  రూ.3,360 చొప్పున ధర లభించింది. ఈ ధర సంతృప్తినిచ్చింది.  
– నడిపిరంగడు, బస్తిపాడు, కల్లూరు మండలం   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా