ఉల్లి మెల్లగా జారింది..!

13 Mar, 2018 09:22 IST|Sakshi

ధర తగ్గిన ఎర్రగడ్డలు

అందుబాటులోకి వచ్చిన కర్నూలు గడ్డలు

కిలో ధర రూ.18–20

కూరగాయల ధరలు భారీగా తగ్గి.. కాస్త పైకి

గడచిన నాలుగు నెలలుగా కొండెక్కిన ఎర్రగడ్డ ఎట్టకేలకు కొండ దిగింది. సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. కిలో రూ.20 లోపు పలుకుతోంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి దిగుమతి పెరగడంతో ధరలు తగ్గి నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో బాగా తగ్గి న కూరగాయల ధరలు మళ్లీ కాస్త పెరగడం గమనార్హం.

తిరుపతి తుడా: ఏటా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఎర్రగడ్డల సమస్య ఉత్పన్నమవుతుంది. 2016 చివర, 2017 జనవరిలో కిలో ఎర్రగడ్డల ధర రూ.100లు దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి (2017 నవంబర్, డిసెంబర్, 2018 జనవరి) రూ.60లకే ఎర్రగడ్డలు లభించినా.. గడ్డల్లో నాణ్యత లోపించింది. పంటపై ప్రభావం అధికంగా ఉండటంతో ఈసారి ఫిబ్రవరి నెల వరకు ఎర్రగడ్డల ధర అధికంగానే ఉంది. ఎట్టకేలకు మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఉల్లిపాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. కూరగాయల ధరలూ భారీగానే తగ్గినా, ఇటీవల కాస్త పైకెక్కి కూర్చున్నాయి. ఇందులో టమాట, బీట్‌రూట్, ఆకుకూర, వంకాయ, బీన్స్‌ ధరలు తక్కువగా ఉన్నాయి.

ధరలు కొండెక్కడానికి ఇదీ కారణం..
నిరుడు సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ముసురు పట్టుకుంది. ఫలితంగా మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో, మహారాష్ట్రలోనూ ఎర్రగడ్డ పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎర్రగడ్డల ధరలు అమాంతం పెరిగాయి. కర్నూలు జిల్లాలో రబీలో సీజన్‌లో సాధారణంగా 20,764 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 13వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. భారీ వర్షాలతో సుమారు 4 వేల హెక్టార్లలో పంట దిబ్బతింది. మహారాష్ట్రలో 38వేల హెక్టార్లకు గాను 27వేల హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. ఇక్కడా సుమారు 10 వేల హెక్టార్లలో వర్షం కారణంగా పంట నాశనమైంది. దిగుబడులు తగ్గడంతో రైతుల వద్దే రూ.30 ధర పలికింది. మహారాష్ట్రలో రైతుల వద్దే రూ.35 పలకడం, ఇవి జిల్లాకు చేరి విక్రయానికి వచ్చేసరికి  రూ.50, 60లు అయిందని దుకాణదారులు చెబుతున్నారు.

కొత్త పంటతో దిగిన ధరలు..
నీటివనరులు పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రతో పాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, కడప జిలాల్లోనూ ఎర్రగడ్డల సాగు ఆశాజనకంగా సాగుతోంది. ఇప్పటికే కర్నూలు గడ్డలతోపాటు మహారాష్ట్ర గడ్డల దిగుమతులు పెరుగుతున్నాయి. రాబోవు రోజుల్లో మరింతగా పంట దిగుమతులు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు పెరుగుతుండటంతో ఉల్లిపాయల ధరలు కిందికి జారుతున్నాయి. మార్కెట్‌లో కిలో ఎర్రగడ్డలు రూ.18– 20లు పలుకుతోంది. రైతుబజార్‌లో రూ.16లకే విక్రయిస్తున్నారు.

పడిపోయిన టమాట..
గతేడాదితో పోలిస్తే అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో సకాలంలో వర్షాలు పడటంతో పడమటి మండలాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. బావుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో పడమటి మండలాల్లో కూరగాయల పంటల సాగు జోరందుకుంది. దీంతో టమాట ధరలు పూర్తి స్థాయిలో పడిపోయాయి. తిరుపతి మార్కెట్‌లో కిలో రూ.4– 5లకే దొరుకుతోంది.

భారీగా తగ్గి.. కాస్త పెరిగిన కూరగాయలు..
జనవరి నెల్లో కిలో టమాట రూ.60, బీన్స్‌ రూ.70, బీట్‌రూట్‌ రూ.90, చిక్కుడు రూ.50, మునగ రూ.100.. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50 పైమాటే. ప్రస్తుతం అన్ని రకాలు కూరగాయలు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే టమాట మినహా,  అన్ని కూరకాయల ధరలు ఫిబ్రవరి నెలతో పోలిస్తే కాస్త పెరిగాయి.

మరిన్ని వార్తలు