నేటి నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లి

24 Nov, 2019 04:08 IST|Sakshi

ఇప్పటికే చాలా రైతుబజార్లలో కిలో రూ.25కే విక్రయం

ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం 

కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం

బయటి మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.80 – రూ.100

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు రైతుబజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.25కే విక్రయిస్తుండగా ఆదివారం నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 85 రైతుబజార్లు ఉండగా అందులో ఇప్పటికే 80 రైతుబజార్లలో ఉల్లి అందుబాటులో ఉంది. బయటి మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.100 వరకు ఉండగా రైతుబజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తుండటంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. అయితే.. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు చేస్తోంది. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి రైతుబజార్లకు చేరుస్తున్నారు. మొదటి రెండు రోజులు ఉల్లిపాయల రవాణాలో కొంత జాప్యం జరగడంతో మారుమూల రైతుబజార్ల అవసరాలకు సరిపోను ఉల్లిపాయలు రాలేదు. దీంతో ధర మరింత పెరగొచ్చనే ఉద్దేశంతో రైతుబజార్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. 

ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా.. ధరల స్థిరీకరణ నిధితో ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో మార్కెటింగ్‌ శాఖ ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి కిలో రూ.48 నుంచి రూ.55 ధరకు మార్కెటింగ్‌ శాఖ ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కర్నూలు జిల్లా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్‌ శాఖ కర్నూలు ఉల్లినే కొనుగోలు చేస్తోంది. పండిన పంటనంతటినీ కర్నూలు రైతుల నుంచి కొనుగోలు చేశాకే ఇతర రాష్ట్రాల ఉల్లిని దిగుమతి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు ఎక్కువ ఉల్లి చేరాక కిలోకి మించి అమ్మాలని భావిస్తున్నారు. 

అవసరమైతే కౌంటర్లు పెంచుతాం
నిర్ణీత సమయాలతో సంబంధం లేకుండా రైతుబజార్లకు చేరిన ఉల్లిపాయలను విక్రయిస్తాం. అవసరమైతే కౌంటర్ల సంఖ్యను పెంచుతాం.
     – ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు