జోరుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు

10 May, 2019 12:50 IST|Sakshi

 జిల్లాలో క్రమంగా విస్తరిస్తున్నఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌

పలు యాప్‌ల ద్వారా అక్రమ దందాకు శ్రీకారం

కమీషన్ల రూపంలో  రూ.కోట్లు సంపాదిస్తున్న బుకీలు

క్రికెట్‌కు యువతలో ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకున్న బుకీలు ఆన్‌లైన్‌లో బెట్టింగులను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. బెట్టింగ్‌లకు డీలర్‌షిప్‌లు తీసుకుని, కమీషన్లపై పనిచేసేలా సబ్‌డీలర్లను నియమించుకుని చెలరేగిపోతున్నారు. ఈజీ మనీ కోసం యువకులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వేలు, లక్షలాది రూపాయలు బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారు.

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంగా మాఫియా రూ.కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. దినసరి కూలీలు, యువత ఈజీ మని కోసం వేలల్లో పందేలు కాస్తుంటే.. వారిని మాయ చేస్తున్న బుకీలు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాధారణ క్రికెట్‌ మ్యాచ్‌లకే బెట్టింగ్‌లు భారీగా నడుస్తుంటాయి. ఇక టీ–20, ఐపీఎల్‌ మ్యాచ్‌ల సీజన్‌లో బెట్టింగ్‌లు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో ఒక్కరోజులోనే జిల్లాలో రూ.5 నుంచి 10కోట్ల వరకు బెట్టింగ్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌–12 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే మే 12వ తేదీలో బెట్టింగ్‌లు రూ.30కోట్లు దాటే అవకాశాలున్నాయని బెట్టర్లు చర్చించుకుంటున్నారు. 

ఇతర రాష్ట్రాల వ్యక్తుల ద్వారా బుకీల దందా
ఆన్‌¯Œలైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ కొన్ని విదేశాల్లో అధికారికంగా కొనసాగుతోంది.  ఆయా దేశాల వ్యక్తులతో పరిచయాలు చేసుకున్న మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్‌ వంటి రాష్ట్రాల్లోని వ్యక్తులతో జిల్లాకు చెందిన బుకీలు పరిచయాలు చేసుకుని ఈ దందా నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న జాతీయ బుకీలతో సంబంధాలున్న జిల్లాకు చెందిన క్రికెట్‌ బుకీలు ఆన్‌¯Œలైన్‌ బెట్టింగ్‌లో డీలర్‌ షిప్‌ తీసుకుని సబ్‌ డీలర్స్‌ను సైతం నియమించుకున్నారు. ముందస్తుగా ఫండర్‌ల నుంచి బుకీలు (డీలర్‌ షీప్‌ తీసుకున్న నిర్వాహకులు) కొంత సొమ్ము తీసుకుని బెట్టింగ్‌ చేయడానికి అవకాశం కల్పిస్తూ, ఆన్‌లైన్‌ లింక్‌లు షేర్‌ చేస్తారు. వెబ్‌ పేజీ, లైన్, నేరుగా ఫోన్‌లో మాట్లాడే విధంగా మొత్తంగా మూడు దశల్లో పెద్దఎత్తున ఈ దందా కొనసాగుతోంది. ఇదే తరహాలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ భారీ ముఠాను గుంటూరు రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బుకీల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు బిత్తరపోయే వివరాలు తెలిశాయి. జిల్లాకు చెందిన 36 మందితో సహా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జాతీయస్థాయి బెట్టింగ్‌ బుకీల వివరాలు వెలుగు చూశాయి.

ప్రత్యేకమైన యాప్‌లు
ఐపీఎల్, ఇతర క్రికెట్‌ బెట్టింగ్‌ల కోసం నిర్వాహకులు హైటెక్‌ పద్ధతిని వినియోగిస్తున్నారు. సెల్‌ఫో¯Œన్‌లలో బెట్‌ –365, బెట్‌వీ, స్పోర్ట్స్‌ బెట్టింగ్, బెట్‌ ప్లేయర్, డ్రీమ్‌ 11, మై టీమ్, ఇండస్‌ గేమ్స్, మై టీమ్‌ 11 వంటి యాప్‌ల నుంచి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌తో పాటు వాలీబాల్, టెన్నిస్, ఫుట్‌బాల్‌ వంటి క్రీడలపై కూడా ఈ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి లావాదేవీలు గూగుల్‌ పే, మై మనీ, భీమ్, ఫోన్‌ పే వంటి ఆన్‌లైన్‌ నగదు బదిలీ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ రాయుళ్లు చేపడుతున్నారు. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో కొన్ని పెద్దపెద్ద హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, లాడ్జీలు, శివారు ప్రాంతాల్లోని ఫ్లాట్‌లు అడ్డాలుగా చేసుకుని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నంత సేపు బెట్టింగ్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి. వేసిన బాళ్లు, క్యాచ్‌లు, వికెట్లు, ఫోర్లు, సిక్స్‌లను బట్టి బెట్టింగ్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. 

చిత్తవుతున్న యువత
జల్సాలకు అలవాటుపడిన యువత తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఈజీ మనీ సంపాదన బాట పడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బుకీలు తమవైపుకు ఆకర్షించుకుని యువతను ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. జిల్లాలోని పలు పేరు మోసిన కాలేజీలు, యూనివర్సిటీల్లో సైతం కొందరు విద్యార్థులు సహ బుకీలుగా ఉంటూ తోటి విద్యార్థులతో బెట్టింగ్‌లు వేయిస్తున్నారు. చదువులు, హాస్టళ్ల అవసరాల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును బెట్టింగ్‌ల్లో పెట్టి పోగొట్టుకుంటున్న విద్యార్థులు వచ్చే మ్యాచ్‌లో డబ్బు వస్తుందని ఆశతో మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నారు.
చాలా సందర్భాల్లో బుకీలే విద్యార్థులకు డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తెలిసో తెలియకో ఈ కూపంలోకి దిగి బుకీలకు డబ్బు కట్టలేక, ఇంట్లో తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందని విద్యార్థులు సతమవుతూ చదువుపై శ్రద్ధ పెట్టలేక బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు