ఆన్‌లైన్ మోసం

13 Jul, 2015 00:47 IST|Sakshi

పెదవాల్తేరు: బ్యాంకు అధికారినని చెప్పి ఫోన్లో ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకుని.. దర్జాగా రూ.10 వేల విలువైన ఆన్‌లైన్ షాపింగ్ చేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీకాలనీకి చెందిన సిహెచ్ అప్పారావు రిటైర్డ్ ఉద్యోగి. అతనికి స్టేట్‌బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఈనెల 11న మధ్యాహ్నం 85810 58891 నంబరు నుంచి అప్పారావుకు ఫోన్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. ‘మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల’ని తెలిపి ఆధార్ కార్డు నంబర్ అడిగాడు. తర్వాత ఏటీఎం కార్డుపై ఉన్న పదహారు అంకెలు చెప్పమన్నాడు. ఏటీఎం కార్డు మరో వైపు ఉన్న చివర మూడు అంకెలు తెలపాలని అడగ్గా అప్పారావు నంబర్లు చెప్పారు. ఏటీఎం కార్డు నంబర్ చెప్పగానే అతను ఫోన్ కట్ చేశాడు. పది నిమిషాలకే మోబి క్విక్ ఆన్‌లైన్ షాపింగ్‌లో రూ.9999 చెల్లించినట్టు అప్పారావు ఫోన్‌కు సందేశం రావడంతో అవాక్కయ్యాడు. వెంటనే తనతో మాట్లాడిన వ్యక్తి నంబర్‌కు డయల్ చేయగా ఆ నంబర్ పనిచేయలేదు. దీంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు