‘స్వీటు’ సెల్లు..గుండె గుబిల్లు

6 Dec, 2018 11:02 IST|Sakshi
పార్శెల్‌లో వచ్చిన స్వీట్‌ బాక్సుతో పోలయ్య

చిత్తూరు, శ్రీకాళహస్తి రూరల్‌: ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే పదివేల రూపాయల ఫోను అని నన్ను ముంచేసినార్రా దేవుడా– అని తనకందిన స్వీట్‌ బాక్సు చూసి ఓ అమాయక చక్రవర్తి గొల్లుమన్నాడు. వివరాలు..శ్రీకాళహస్తి మండలం కుంటిపూడి పంచాయతీ రామానుజపల్లెకు చెందిన కూనాటి పోలయ్య యాదవ్‌కు ఇరవై రోజుల క్రితం 7899912304 సెల్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రముఖ సెల్‌ఫోన్‌ కంపెనీకి చెందిన రూ.10 వేల విలువ చేసే స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 1,680లకే ఇస్తున్నామని ఫోన్‌ చేసి వ్యక్తి నమ్మించాడు.

దీంతో పోలయ్య సంబరపడి అంగీకరించాడు. ఆ తర్వాత  తపాలా పార్శెల్‌లో సెల్‌ఫోన్‌ పంపామని వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పడంతో ఎగిరిగంతేశాడు. బుధవారం స్థానిక పోస్టాఫీసుకెళ్లాడు. పార్శెల్‌ వచ్చినట్లు తెలుసుకున్నాడు. ఆ సమయానికి డబ్బు లేకపోవడంతో మరలా గ్రామానికి వెళ్లి తెలిసినవారి వద్ద  రూ.1,700 అప్పు చేసి పార్శెల్‌ను తీసుకున్నాడు . ఆ పార్శెల్‌ మీద ‘వి.హెచ్‌.మార్కెటింగ్, 4వ మెయిన్‌ ఆనందగిరి ఎక్స్‌టెన్షన్, బెంగళూరు–24, కస్టమర్‌ కేర్‌ : 7899912304’ అని కూడా ఉంది. అనంతరం అతను పార్శెల్‌  తెరచి చూసేసరికి పావు కిలో సోన్‌ పప్పడి స్వీట్లæ ప్యాకెట్‌ దర్శనమివ్వడంతో కంగుతిన్నాడు. ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ పేరిట తనను బురిడీ కొట్టిం చారని గ్రహించి లబోదిబోమన్నాడు. కనిపించి న వారందరికీ ‘స్వీటు బాక్సు’ చూపుతూ ఆక్రోశిస్తున్నాడు. పాపం పోలయ్య!

>
మరిన్ని వార్తలు