విద్యుత్తు లోటుకు ‘ఆన్‌లైన్’ పరిష్కారం

16 Sep, 2014 02:34 IST|Sakshi
విద్యుత్తు లోటుకు ‘ఆన్‌లైన్’ పరిష్కారం
  • ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం
  •   అంతర్జాతీయ ప్రమాణాలతో కరెంటు సరఫరా
  •   రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకు 120 సంస్థల సంసిద్ధత
  •   మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై 
  •   నిషేధం మరో ఏడాది పొడిగింపు
  •   అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు పార్కులకు భూముల కేటాయింపు
  •  సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు లోటును పూడ్చేందుకు ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి సచివాలయంలో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో రెండేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని 9,624 ఫీడర్లను ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థలోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ విధానాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఏపీలోనే ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 132 మిలియన్ యూనిట్లు ఉండగా, సరఫరా 131.4 మిలియన్ యూనిట్లు ఉందన్నారు. ఆన్‌లైన్ మానిటరింగ్ ద్వారా విద్యుత్తు సరఫరా నష్టాలను తగ్గించి, ఈ స్వల్ప విద్యుత్తు లోటును పూడుస్తామని చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎనర్జీ ఆడిట్ చేసినట్లు తెలిపారు. కరెంటు చౌర్యం, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్ నష్టాల్ని లెక్కిస్తే రాష్ట్రంలో 14.5 శాతం నష్టాలు నమోదయ్యాయన్నారు. అనంతపురం పట్టణంలో అత్యధికంగా 10.1 శాతం, కర్నూలులో 7.8 శాతం, గుంటూరులో 5 శాతం విద్యుత్తు నష్టాలు ఉన్నాయని తెలిపారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో వైజాగ్, తిరుపతి, హైదరాబాద్, చెన్నైలలో చేపట్టిన నాలుగు రోడ్ షోలకు అనూహ్య స్పందన వచ్చిందని, రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు 120 కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ-కేబినెట్ నిర్వహించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. మంత్రివర్గానికి ఐ ప్యాడ్‌ల ద్వారా అజెండా ఇచ్చి, సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
     
     రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
    •   రాష్ట్రంలోని రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రాడికల్  యూత్ వింగ్, రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్‌పై  నిషేధం మరో ఏడాది పొడిగింపు.
     - సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 2,500 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పార్కుల ఏర్పాటు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎం.పి.కుంటలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు. దీనికోసం 5,500 ఎకరాల భూమి కేటాయింపు. కర్నూలు జిల్లా పాణ్యంలో 1,000 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పార్క్ ఏర్పాటుకు ఎన్‌వీవీఎల్ సంస్థకు 5 వేల ఎకరాలు కేటాయింపు. కడప జిల్లా గాలివీడులో 500 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించే ప్లాంటుకు 3 వేల ఎకరాల కేటాయింపు. మంగళవారం హైదరాబాద్‌కు రానున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమక్షంలో ఈ పార్కులతో పాటు విశాఖలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వంతో ఎంఒయూ కుదర్చుకునేందుకు నిర్ణయం. సోలార్ పార్కుల స్థాపనకు కేపిటల్ కంట్రిబ్యూషన్ కింద కేంద్రం 50 శాతం, ఏపీ జెన్‌కో 41 శాతం, నెడ్‌క్యాప్ 9 శాతం నిధులు సమకూరుస్తాయి.
     -  ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మొదటి దశ అక్టోబర్ 2 నుంచి 175 నియోజకవర్గాలు, 1,230 గ్రామాల్లో ప్రారంభం. అయితే, ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
     - అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఏడు మిషన్లను నెల రోజుల్లోగా ప్రారంభించాలని నిర్ణయం.
     - పింఛన్ల మంజూరుకు వంద శాతం ఆధార్, బయోమెట్రిక్, ఐరిష్‌తో అనుసంధానించాలని నిర్ణయం. పింఛన్లకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయి కమిటీలు ఈ నెల 19 నుంచి 21 వరకు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం. రాష్ట్రంలో 20,72,338 మంది వృద్ధులు, 13,21,420 మందికి వితంతువులు, 5,36,998 మంది వికలాంగులు, 74,673 మంది చేనేత కార్మికులు, 10,024 మంది గీత కార్మికులు, ఇతరులు కలిపి మొత్తం 43,12,533 మంది పింఛన్లు పొందుతున్నట్లు గుర్తింపు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గం అంచనా. కేంద్ర ప్రభుత్వం 9 లక్షల పింఛన్లకు మాత్రమే రూ.300 వంతున అందిస్తోందని వెల్లడి.
     - అక్టోబర్ 2 నుంచి పింఛన్లను పంపిణీ చేసే సభల్లో ఉదయం, సాయంత్రం వేళ ఎమ్మెల్యేలు పాల్గొనాలి. దీంతోపాటు వైద్య, పశువైద్య శిబిరాలు, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం, పేదరికంపై గెలుపు కార్యక్రమాలు నిర్వహించాలి. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లు, ఐదు క్యాంపెయిన్లపై విసృ్తత ప్రచారం చేయాలి. 
     - రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్పు. ఇందులో 250 వ్యాధులను చేర్చిన ప్రభుత్వం. ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులకు రూ.2.50 లక్షల పరిమితితో హెల్త్ కార్డుల పంపిణీ.
     - అడ్వైజరీ కమ్యూనికేషన్స్‌కు అవసరమైన ఎనిమిది పోస్టుల మంజూరు.
     - లేజిస్లేచర్ కమిటీలు, స్థాయీ సంఘాలకు మొత్తం 83 మంది సిబ్బందిని తీసుకోవడానికి నిర్ణయం.
     - వంద రోజుల ప్రణాళికపై మంత్రులు అధికారులతో సమీక్షించి, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశం.
మరిన్ని వార్తలు