ఒట్టి మాటలే..!

9 Aug, 2013 05:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం :మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదే! హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ ఆయకట్టు 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2012 నవంబర్ 29న జీడిపల్లి రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంలో హామీ ఇచ్చారు. కానీ.. ఆ తర్వాత నీళ్లందించే ఆయకట్టును 1.98 లక్షల ఎకరాల నుంచి 40 వేలకు కుదించారు. పోనీ.. ఆ 40 వేల ఎకరాలకైనా నీళ్లందిస్తారా అంటే నీటిపారుదలశాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. కారణం.. ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను కాంట్రాక్టర్లు ఇప్పటికీ ప్రారంభించకపోవడమే. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.6,850 కోట్లతో పరిపాలనపరమైన అనుమతులను జారీ చేసి.. పనులను ప్రారంభించారు.


 ఇందులో హంద్రీ-నీవా తొలి దశ అంచనా వ్యయం రూ.2,774 కోట్లు. ఇప్పటిదాకా 2,750 కోట్ల విలువైన పనులను పూర్తి ఒట్టి మాటలే..!చేశారు. తొలి దశ పనులు పూర్తి కావాలంటే మరో రూ.400 కోట్లను ఖర్చు చేయాలి. కానీ.. సర్కారు సక్రమంగా నిధులను విడుదల చేయకపోవడంతో హంద్రీ-నీవా తొలి దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటరీల పనులనే కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం అందుకు తార్కాణం. హంద్రీ-నీవా తొలి దశలో 1.98 లక్షల ఆయకట్టు ఉండగా.. ఇందులో 80 వేల ఎకరాల ఆయకట్టు కర్నూలు జిల్లా పరిధిలోనూ.. తక్కిన 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు మన జిల్లాలోనూ ఉంది. హంద్రీ-నీవా తొలి దశ పనులను పాక్షికంగా పూర్తి చేసిన ప్రభుత్వం నవంబర్ 18న ట్రయల్ రన్ చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2.5 టీఎంసీల నీటిని ట్రయల్ రన్‌లో భాగంగా ఎత్తిపోసింది. ఇందులో 0.58 టీఎంసీల జలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు చేరిన సందర్భంగా నవంబర్ 29న రఘువీరా పాదయాత్రను అక్కడ ముగించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ హంద్రీ-నీవా తొలి దశ ఆయకట్టుకు 2013 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.


కృష్ణమ్మ పొంగిపొర్లుతున్నా..
హంద్రీ-నీవాను మిగులు జలాల ఆధారంగా చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 2012 నవంబర్ 18న ట్రయల్ రన్ సందర్భంగా 2.5 టీఎంసీల నీళ్లను హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోస్తే ఓ ప్రాంతం ప్రజాప్రతినిధులు రాద్ధాంతం చేశారు. మిగులు జలాలతో చేపట్టిన ప్రాజెక్టుకు నికర జలాలను ఎలా విడుదల చేస్తారని నానా యాగీ చేశారు. హంద్రీ-నీవాకు కృష్ణా మిగులు జలాల్లో కేటాయించిన 40 టీఎంసీలను.. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే 120 రోజుల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత 20 రోజులుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను వరద ముంచెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో పక్షం రోజుల క్రితమే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ కూడా బుధవారం నిండిపోయింది. దాంతో.. గురువారం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవాకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అదే 20 రోజుల క్రితమే నీటిని విడుదల చేసి ఉంటే.. వర్షాభావంతో అలమటిస్తోన్న ‘అనంత’ దాహార్తి అయినా తీరి ఉండేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక బుధవారం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోసిన జలాలు గురువారం మధ్యాహ్నానికి బ్రాహ్మణకొట్కూరు వద్దకు చేరాయి. మన జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చే బుధవారం నాటికి కృష్ణా జలాలు చేరే అవకాశం ఉందని హంద్రీ-నీవా ఎస్‌ఈ సుధాకర్‌బాబు వెల్లడించారు.


ఆయకట్టు కనికట్టే..
2010 ఖరీఫ్‌లోనే హంద్రీ-నీవా తొలి దశ కింద ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పటి సీఎం రోశయ్య 2010 ఏప్రిల్ 24న ప్రకటించారు. కానీ.. 2010 ఖరీఫ్ నాటికి తొలి దశ పనులే పూర్తి కాలేదు. 2011 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందిస్తామని ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ.. 2011 నాటికి పనులు పూర్తి కాలేదు. దాంతో.. ముహూర్తాన్ని 2012 ఖరీఫ్‌కు వాయిదా వేశారు. కానీ.. ఆ ముహూర్తం కూడా కుదరలేదు. చివరకు 2013 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని ప్రకటించారు. పోనీ.. ఈ సారైనా జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అదీ లేదు. తొలుత 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని సీఎం ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత మాట మార్చి 80 వేల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. పోనీ.. ఆ మాటపైనైనా నిలబడ్డారా అంటే అదీ లేదు.. చివరకు 40 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని తేల్చారు. ఇందులో కర్నూలు జిల్లాలో 20 వేల ఎకరాలకు.. మన జిల్లాలో 20 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించారు. కానీ.. ఆ ఆయకట్టుకు కూడా నీళ్లందించే పరిస్థితులు కన్పించడం లేదు. ఎందుకంటే.. జిల్లా పరిధిలో ఎక్కడా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తికాలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమేనన్నది స్పష్టమవుతోంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోని రెవెన్యూ మంత్రి రఘవీరారెడ్డి హంద్రీ-నీవా కింద ఆరుతడి పంటలు సాగు చేసుకునే రైతులను చైతన్య పరచాలని అధికారులకు దిశానిర్దేశం చేయడం కొసమెరుపు.
 

మరిన్ని వార్తలు