అయ్యో ‘పాప’ం!

23 Aug, 2013 05:06 IST|Sakshi

 మారేడుపల్లి, న్యూస్‌లైన్: ఆ తల్లి ఏ తప్పు చేసిందో.. లేక ఏ కష్టమొచ్చిందో.. ఆడబిడ్డ అని తెలిసి పెంచే స్తోమత లేక వదిలించుకోవాలనుకుందో పాపం.. అప్పుడే పుట్టిన బొడ్డూడని ఆడబిడ్డను చెత్తకుండీ పాలు చేసింది. వీధి కుక్కులకు ఆహారం అవ్వాల్సిన ఆ శిశువు ఇద్దరు మావనతామూర్తుల సాయంతో బతికి బట్టకట్టింది. వివరాలిలా ఉన్నాయి. కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని వాసవినగర్‌లోని కమ్యూనిటీహాల్ ఎదురుగా అక్కడే వున్న గాంధీ విగ్రహం సాక్షిగా చెత్త కుప్పలో గురువారం ఓ ఆడ పసికందును పడేసి వెళ్లింది ఓ తల్లి. అక్కడే కాస్త దూరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికురాలు అక్కడి చెత్త వేయడానికి వచ్చి చూడగా పసిబిడ్డ బట్టలో చుట్టి అగుపడింది. ఈ విషయాన్ని స్థానికులకు తెలిపింది.
 
  విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక సేవా కార్యకర్త తేలుకుంట సతీష్‌కుమార్ గుప్తా సంఘటనా స్థలానికి వ చ్చారు. సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న వై. మహేశ్వరి సాయంతో పసికందును కట్టి ఉన్న ప్టాస్టిక్ కవరును తొలగించగా ఆ శిశువు కెవ్వున ఏడ్చింది. హమ్మయ్య.....పాప బతికే ఉందని అంతా అనందించారు. ఈ లోపు కార్ఖానా రక్షక్ వాహనం అక్కడికి చేరుకోగానే ఆ ఆడశిశువును సతీష్‌కుమార్ విక్రమ్‌పురిలో ఉన్న రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు నిర్వహించి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఆ చిన్నారి క్షేమంగా ఉంది.

మరిన్ని వార్తలు