అయ్యో సారూ..

18 Nov, 2013 03:27 IST|Sakshi

వరంగల్, న్యూస్‌లైన్ : పంట నష్టం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముందుగా ప్రకటించిన జాబితా మారిపోయింది. గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు కురిసిన వానలకు జిల్లావ్యాప్తంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ముందుగా 2,80,467 ఎకరాల్లో పత్తి, 69,897.5 ఎకరాల్లో వరి, 7,857.5 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వర్షంతో దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాలు పంపించింది. అనంతరం అదే నెల 28వ తేదీ నుంచి గ్రామాల వారీగా సర్వే మొదలుపెట్టింది.

20 రోజులుగా గ్రామాల వారిగా నష్టపోయిన పంటల వివరాలు సేకరించిన వ్యవసాయ, రెవెన్యూ శాఖలు పంటలకు పెద్ద ప్రమాదమేమీ లేదనే నివేదికలిచ్చాయి. మొత్తం 27,225 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు లెక్క తేల్చారు. వీటిలో వరి 25,000 ఎకరాలు (10 వేల హెక్టార్లు), 750 ఎకరాల పత్తి (300 హెక్టార్లు), 1,475 ఎకరాల మొక్కజొన్న (590 హెక్టార్లు) పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మొత్తానికీ... ఇరవై రోజుల సర్వే అనంతరం వేలాది ఎకరాల పంటల జాబితా కుదించుకుపోవడం గమనార్హం.
 
50 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలనే...


వరుస వానలతో జిల్లావ్యాప్తంగా 35 మండలాల పరిధిలోని 640 గ్రామాల్లో 3,60,497 ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయినట్లు, వాటి విలువ రూ. 686 కోట్లు ఉంటుందని గత నెల 27వ తేదీన కలెక్టర్ కిషన్ ప్రకటించారు. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం అంచనా వేసినట్లు... క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే చేయిస్తున్నామని వెల్లడించారు. కానీ... ప్రభుత్వ తిరకాసు కారణంగా నష్టపోయిన పంటల జాబితా చిన్నబోయింది.

50 శాతానికి పైగాదెబ్బతిన్న పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కేవలం 27,225 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ మేరకు జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. కాగా, వాస్తవంగా లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా... సర్వేలో మాత్రం వందల ఎకరాలకే పరిమితమైంది. చాలా మంది రైతులు అధికారులు వచ్చేంత వరకూ పంట ఉత్పత్తులను నీళ్లలోనే ఉంచారు. చాలా రోజులు ఆలస్యం కావడంతో కొంతమంది పత్తి ఏరుకోగా, వరిని కోత పెట్టారు. అలాంటి రైతుల పేర్లు జాబితాకెక్కలేదు.
 
రేపటి నుంచి గ్రామాల్లో జాబితా ప్రదర్శన


 నష్టపోరుున పంటల అంచనా సర్వేను పూర్తి చేసిన వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మంగళవారం నుంచి గ్రామాల వారీగా నష్టపోయిన పంటలు, రైతుల జాబితాను పంచాయతీ కార్యాలయూల్లో ప్రదర్శించనున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు రామారావు తెలిపారు. ఈ మేరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైన పక్షంలో రీ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు