ఓపెన్‌ డీల్‌!

2 May, 2019 13:14 IST|Sakshi
కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో బుధవారం స్లిప్పులు పెట్టుకొని పరీక్షలు రాస్తున్న దృశ్యం

 ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ  పరీక్షల్లో అక్రమాలు

పాస్‌ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి వసూళ్లు

రూ.10 వేల నుంచి రూ.15 వేలు డిమాండ్‌

పరీక్షల్లో చూచిరాతకు        గేట్లు ఎత్తివేత

పేరుకే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు

ముందుగానే లాలూచీలు..

ఇన్విజిలేటర్లే బోర్డుపై సమాధానాలు రాస్తున్న వైనం

కంభంలోని ప్రభుత్వ పాఠశాలలో జోరుగా కాపీయింగ్‌

ఒంగోలు టౌన్‌: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షల్లో అక్రమాలు ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు డీల్‌ కుదుర్చుకున్నారు. పాస్‌ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పరీక్ష రాస్తున్న ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల రూపాయల చొప్పున డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరీక్షలు రాసేవారిలో రెగ్యులర్‌ విద్యార్థుల కంటే సర్టిఫికేట్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఉండటంతో నిర్వాహకులు అడిగినంతగా ముట్ట చెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల చూచిరాతకు గేట్లను బార్లా తెరిచారు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలకు 5049 మంది అభ్యర్థులు, ఇంటర్‌మీడియట్‌ పరీక్షకు 5479 మంది హాజరవుతున్నారు. పదో తరగతి అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలు, ఇంటర్‌మీడియట్‌ అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ సర్టిఫికెట్లు ఎంతో వాల్యూ
ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌ సర్టికెట్లకు రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ఉన్నంత విలువ ఉంది. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, పదోన్నతులు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అనేకమంది ఓపెన్‌ స్కూల్స్‌ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. నామమాత్రపు ఫీజులతో పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌లో చేరిన తరువాత వార్షిక పరీక్షల్లో నిర్వాహకులు అడిగినంత ముట్టచెబితే దర్జాగా సర్టిఫికెట్లు వచ్చి చేతిలో పడతాయి. ఎంతో విలువైన సర్టిఫికెట్లనునిర్వాహకులు కూడా అంతే విలువుగా మార్చుకోవడం విశేషం. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాన్ని, ఆతృతను నిర్వాహకులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

సెంటర్‌లోనే రాయ‘బేరాలు’
జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌కు సంబంధించి 60 సెంటర్లు ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్‌ మీడియట్‌ చదివేవారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఏడాదికి 24కు తగ్గకుండా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పదో తరగతి చదవాలనుకునేవారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 14 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సు ఉన్నా అర్హులే. ఇంటర్‌ మీడియట్‌కు సంబంధించి కచ్చితంగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి 15 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సు ఉన్నా అర్హులే. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. వారిలో ఒకరు ప్రధానోపాధ్యాయులుగా, సెంటర్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. తాము నిర్వహించే సెంటర్లలో పదవ తరగతి, ఇంటర్‌ మీడియట్‌లో చేరేందుకు వచ్చేవారి వివరాలను, ఎలాంటి అవసరార్ధం కోసం చేరుతున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడ నుండే రాయ‘బేరాలు’ సాగిస్తుంటారు.

ఇన్విజిలేటర్‌ డ్యూటీలకు డిమాండ్‌..
జిల్లాలో జరుగుతున్న ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షల ఇన్విజిలేటర్‌ డ్యూటీలకు ఎక్కడాలేని డిమాండ్‌ వచ్చి పడింది. ఏటా వేసవి సెలవుల్లో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఉండే ఉపాధ్యాయులు ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష విధులకు హాజరైతే వచ్చే విద్యా సంవత్సరంలో ఎర్న్‌డ్‌ లీవ్‌లు పొందే వెసులుబాటు ఉంది. దీంతో ఇన్విజిలేటర్‌ డ్యూటీలంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎగిరి గంతేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఒంగోలులోని ఒక పరీక్ష కేంద్రం. దీని పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏడుగురు ఇన్విజిలేటర్లు సరిపోతారు. కానీ, ఏకంగా 35మంది ఇన్విజిలేటర్లు విధులకు హాజరవుతున్నారంటే ఆ డ్యూటీలకు ఎంత డిమాండ్‌ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రూ.15 లక్షల కారు గిఫ్ట్‌..
జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు జరిగే ప్రతిసారీ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటాయి. 2015–2017 మధ్యకాలంలో జిల్లా విద్యాశాఖాధికారిగా వ్యవహరించిన ఒక అధికారికి అప్పటి ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ 15 లక్షల రూపాయల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారంటే పరీక్షల్లో అభ్యర్థుల నుండి ఏ మేరకు వసూలు చేశారో అర్ధమవుతోంది. ఆ సమయంలో జిల్లాలో జరిగిన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల అక్రమాల గురించి పత్రికల్లో కథనాలు రావడంతో సాక్షాత్తు ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వచ్చి పరీక్షలను పర్యవేక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఓపెన్‌ పరీక్షల్లో కూడా అభ్యర్థుల నుంచి వసూళ్లు చేస్తున్న దానిలో కింది నుంచి విద్యాశాఖలో కీలక స్థాయిగా వ్యవహరించే వారివరకు ఎవరి వాటాలు వారికి సిద్ధం చేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుంటేనే..
ఓపెన్‌ స్కూల్‌ సొసైటీకి జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఓపెన్‌ స్కూల్‌కు  కార్యక్రమాల నివేదికలను కలెక్టర్‌ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఓపెన్‌ పరీక్షల విషయంలో గేట్లు బారుగా తెరిచి పెద్ద ఎత్తున జరుగుతున్న వసూళ్ల పర్వానికి జిల్లా కలెక్టర్‌ బ్రేక్‌లు వేయాల్సి ఉంది. ఆయన కూడా మౌనంగా వ్యవహరిస్తే జిల్లాలో ఓపెన్‌ అక్రమాలకు అడ్డే ఉండదు. అభ్యర్థుల నుంచి వసూళ్లకు అంతమనేది ఉండదు.

కంభంలో జోరుగా కాపీయింగ్‌
కంభం :  పదో తరగతి ఓపెన్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ జోరుగా సాగింది. పాపం విద్యార్థుల కష్టాన్ని చూడలేక ఇన్విజిలేటర్లే ఎంచక్కా ప్రశ్న పత్రం చూసి బ్లాక్‌ బోర్డుపై సమాధానం రాశారు. ఆ కేంద్రంలో లేటు వయసులో పరీక్షకు హాజరైన వారంతా వాటిని చూచి రాస్తూ పండుగ చేసుకున్నారు. పదోతరగతి ఓపెన్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు ముందు జిల్లా ఉన్నతాధికారులు ఓపెన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ ఆచరణలో కనబడలేదు. కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించగా అక్కడ జరిగిన పరీక్షల్లో ఇన్విజిలేటర్లే బోర్డులపై ప్రశ్నలకు సమాధానాలు రాయడం విశేషం.పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా  కేంద్రంలోకి వెళ్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే చీఫ్‌ సూపరిండెంట్‌ వెళ్లిపోయినట్లు తెలిసింది. స్క్వాడ్‌ అధికారులు కూడా అలా వచ్చి, ఇలా వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత  ఇన్విజిలేటర్లు కాపీయింగ్‌కు తెరలేపారు. రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక పరీక్షలు ఎంత బాగా జరగనున్నాయో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు