అంతా ‘ఓపెన్‌’గానే..

8 May, 2019 13:40 IST|Sakshi
బందరులో ఓపెన్‌ టెన్త్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం కొందరు, ఏదైనా డిగ్రీ పట్టా పొందాలనే కోరికతో మరికొందరు.. కారణమేదైనా  అభ్యర్థి అవసరమే ఓపెన్‌ స్టడీ సెంటర్లకు    వరమవుతోంది. డబ్బిస్తే చాలు పాస్‌ గ్యారంటీ అంటూ ఆఫర్లు ఇస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. వీరు చేస్తున్న చట్ట వ్యతిరేక పనులతో నిజాయితీగా చదివి పరీక్ష రాస్తున్న విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. అక్రమాలను కనిపెట్టి కట్టడి చేయాల్సిన విద్యాశాఖాధికారులు కూడా వీరికే వంత పాడుతుండడంతో వ్యవహారమంతా           ‘ఓపెన్‌’గానే సాగిపోతోంది.

సాక్షి, అమరావతి బ్యూరో: ఓపెన్‌లో టెన్త్‌ చదివే విద్యార్థులకు సాధారణంగా రూ.750 దాకా ఫీజు ఉంటుంది. నేరుగా అభ్యర్థులు ఫీజు కట్టకుండా తమ ద్వారా ఫీజు కట్టి పరీక్షలు రాస్తే పాస్‌ గ్యారంటీ అంటూ ప్రైవేట్‌ ఏజెన్సీల వారు విద్యార్థులకు ఆఫర్‌లు ఇస్తున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఇచ్చే వెసులుబాటును బట్టి రేట్లను ఫిక్స్‌ చేస్తున్నారు. స్లిప్‌లు పెట్టి రాయిస్తే ఒక రేటు, టెక్ట్స్‌ బుక్స్‌ చేతికిచ్చి రాయిస్తే మరోరేటు పెడుతున్నారు. మరికొన్ని ఏజెన్సీలైతే అసలు పరీక్షే రాయకుండా మరో వ్యక్తితో పరీక్ష రాయిస్తున్నారు. దీనికి భారీ స్థాయిలో డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకుని మరీ దందాను నడుపుతున్నారు. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 నుంచి రూ.6 వేల వరకు ఫీజు రూపంలో వసూల్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో పరీక్షా కేంద్రంనిర్వాహకులకు, విద్యాశాఖాధికారులకు కూడా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం.

జిల్లాలో పరిస్థితి..
మే నెల 1 తేదీ నుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు మొదలయ్యాయి. జిల్లాలో పదోతరగతి పరీక్షలను 3,774 మంది రాస్తుండగా, ఇంటర్‌ పరీక్షలను 4,046 మంది నమోదు చేస్తుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు 14 కేంద్రాలు, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు 14 కేంద్రాల్లో జరుగుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నాటికి పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే ఫణి తుపాన్‌ నేపథ్యంలో గత శుక్ర, శని వారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. దీంతో పరీక్షలు ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్నాయి.

చూసీచూడనట్లుగా ఇన్విజిలేటర్లు..
ఓపెన్‌ స్కూల్‌ సెంటర్ల నిర్వాహకులు పరీక్షా కేంద్రాల వద్ద తిష్టవేసి మరీ చూచిరాతల ప్రక్రియను సాగిస్తున్నారు. ఇన్విజిలేటర్లకు తాయిలాలను అందించి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేలా ఒప్పిస్తున్నారు. ఇన్విజిలేటర్లుకు జంబ్లింగ్‌ విధానంలో ఇంతవరకు లేకపోవటం కూడా సెంటర్ల నిర్వాహకులకు సులువవుతోంది. మంగళవారం నూజివీడు పరీక్షా కేంద్రంలో చూచిరాతలకు సహకరించిన ఐదుగురు ఇన్విజిలేటర్లుకు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాదికి ఓపెన్‌ స్కూల్‌ దందా ద్వారా దాదాపు 3 కోట్ల రూపాయలు వరకు చేతులు మారుతుందని ప్రచారం జరుగుతోంది.

పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు
నూజివీడు మాస్‌కాపీయింగ్‌ ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌లకు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షల నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. పాస్‌ గ్యారంటీ అంటూ డబ్బులు వసూలు చేసే ఏజెంట్లను నమ్మకండి.– నాగమల్లేశ్వరరావు, ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల విభాగం అధికారి, కృష్ణా జిల్లా

మరిన్ని వార్తలు