ఓపెన్‌ పై గట్టి నిఘా..

7 May, 2019 10:50 IST|Sakshi
ఓపెన్‌ టెన్త్‌ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు

అయినా ఆగని కాపీయింగ్‌

అవస్థలు పడుతున్న సిబ్బంది...

విజయనగరం, శృంగవరపుకోట: పట్టణంలోని కేంబ్రిడ్జ్‌ పాఠశాలలో ఓపెన్‌ ఇంటర్మీడియట్‌.. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఓపెన్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ పెద్ద ఎత్తున జరగడం.. మీడియాలో వరుసగా వస్తున్న కథనాలపై విద్యాశాఖ స్పందించి చర్యలకు సిద్ధపడుతోంది.

అదనపు సిబ్బంది నియామకం..
మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను, మహిళా అభ్యర్థుల తనిఖీల నిమిత్తం ఒక్కో మహిళా ఉపా«ధ్యాయురాలిని నియమిస్తూ  ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం వారు ఆయా కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యారు. మాస్‌ కాపీయింగ్‌ నివారణకు నిరంతర నిఘా, తనిఖీలు చేపట్టినట్టు ఎంఈఓ కూర్మారావు చెప్పారు. మాస్‌కాపీయింగ్‌ జరిగితే అభ్యర్థులపై చర్యలతో పాటూ ఇన్విజిలేటర్లపై సస్సెన్షన్‌ వేటు వేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

 ఆగని దొంగరాతలు
కేంబ్రిడ్జ్, ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సోమవారం కూడా చూచి రాతలు దర్జాగా సాగాయి. అభ్యర్థులను తనిఖీ చేసే సమయంలో స్లిప్పులు దొరికినా.. కొంతమంది దొంగచాటుగా మెటీరియల్‌ పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లారు. కేంబ్రిడ్జ్‌ పాఠశాలకు మీడియా వాళ్లొచ్చారనగానే అభ్యర్థులు కిటీకీల్లోంచి సోమవారం నాటి పరీక్షలైన భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రంలకు చెందిన మెటీరియల్‌ విసిరేశారు. ఇదేమని నిర్వాహకులను అడిగితే మాస్‌ కాపీయింగ్‌ను నివారించడానికి మా శాయశక్తులా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ బదులివ్వడం విశేషం.

మరిన్ని వార్తలు