జోరుగా బ్యాంకు ఖాతాల ఓపెనింగ్

6 Oct, 2013 03:41 IST|Sakshi

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ :జిల్లావ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మేళా శనివారంతో ముగస్తుందని తెలియడంతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో ఖాతాదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని కార్గిల్ పార్కులో ఏర్పాటు చేసిన కేంద్రం ఖాతారులతో కిక్కిరిసిపోయింది. లోపల, బయట.. ఎక్కడ చూసినా ఖాతాదారులే కనిపించారు. ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 10,856 మందికి ఖాతాలు అందజేయగా, 1 తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 34,909 బ్యాంకు ఖాతాలు అందజేశారు.
 
 మొత్తం 19 బ్యాంకులు ఈ మేళాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీడ్‌బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ విజయేందర్ మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 7 మున్సిపాలిటీలు, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఎంపీడీవో కా ర్యాలయంలో బ్యాంకు ఖాతా మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నగదు బదిలీ పథకం అమలు కోసం బ్యాంకు ఖాతాలు తప్పనిసరి కావడంతో జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాల మేరకు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని తెలిపారు. ఈ మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 11 వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణంలోని అన్ని కాలనీల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నామని, అంతేకాకుండా ఐకేసీ సిబ్బంది, కౌన్సెలర్ల ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు వివరించారు. మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెప్యూటీ తహశీల్దార్ ఆనంద్‌బాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు