తెరుచుకున్న బాబ్లీగేట్లు

2 Jul, 2014 02:32 IST|Sakshi
తెరుచుకున్న బాబ్లీగేట్లు

నిజామాబాద్: సుమారు ఎనిమిది నెల ల పాటు గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన మహా రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో బాబ్లీకి ఉన్న 14 గేట్లను ఎత్తారు.  బాబ్లీ ప్రాజెక్టు అధికారి ఎస్వీ సాల్వి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మీడియాను సైతం ప్రాజెక్టు వద్దకు అనుమతించలేదు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు విజయ్ చోబే, ఇంజనీర్ జీఎస్ లోఖండే, బాబ్లీ గ్రామ సర్పంచ్ గంగాబాయి, నాందేడ్ సీఐ పంకజ్ దేశ్‌ముఖ్ తదితరులు పాల్గొన్నారు.

కోర్టు తీర్పు ప్రకారం రానున్న అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తి ఉంచనున్నారు.మన రాష్ట్రానికి, మహారాష్ట్రకు గతం లో బాబ్లీ వివాదం నెలకొన్న నేపథ్యంలో మన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు ఏటా అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లను మూసి ఉంచాలని, జూలై 1న తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం కలగకుండా గేట్లు ఎత్తి ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.
 

మరిన్ని వార్తలు