ఆపరేషన్‌ గజేంద్ర

20 Mar, 2019 10:59 IST|Sakshi
సీతంపేట: ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

సాక్షి,వీరఘట్టం, సీతంపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీడీఏలో మొదటి పాలకవర్గ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరై ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏజెన్సీలో ఏనుగులు అడుగుపెట్టి 12 ఏళ్లవుతున్నా వాటి గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఈ ప్రభుత్వ హయాంలో మరింత నిర్లిప్తతతో పాటు గిరిజనులకు భద్రత కరువైంది.


ఇదీ విషయం
2007 మార్చి నెలలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల గుంపు అడుగుపెట్టాయి. వాటిని తరలించేందుకు అదే ఏడాది అక్టోబర్‌లో అప్పటి అటవీశాఖా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ఆపరేషన్‌ గజ చేపట్టారు. జయంతి, గణేష్‌ అనే శిక్షణ పొందిన ఏనుగులను తీసకువచ్చి వాటి సహాయంలో ఏనుగుల గుంపును ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు శ్రమించారు. అయితే ఈ క్రమంలో ఏనుగులు ఒక్కొక్కటిగా మృతి చెందడం, ఒడిశా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఆపరేషన్‌ గజ నిలిచిపోయింది. అనంతరం ఆపరేషన్‌ గజేంద్ర పేరుతో మళ్లీ ఏనుగుల తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 7 ఏనుగులు మృతి చెందగా, ఏనుగుల దాడిలో 13 మంది మృత్యువాతపడ్డారు. కానీ మృతుల కుటుంబాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఏనుగులను తరలించేందుకు 11 ఏళ్లలో రూ. 2.25కోట్లు ఖర్చు చేశారు.  ఐటీడీఏ పరిధిలో సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మందస, మెళియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో గజరాజుల సంచారం ఎక్కువగా ఉంది. కొండపోడు ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు అధికంగా ఉన్నాయి. గజరాజుల దాటికి గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.


భారీగా పంటలు నష్టం
గిరిజనులకు చెందిన వందలాది ఎకరాల్లో పంటలను ఏనుగులు నాశనంచేశాయి. 274.98 హెక్టార్లలో పంటలు ధ్వంసం కాగా 1059 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 42లక్షలు నష్టపరిహా రం చెల్లించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పంటల నష్టం ఇంతకు రెండింతలు ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోతే వందల ఎకరాల్లోనే చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని వాపోతున్నారు.

ఏనుగుల తరలింపులో నిర్లక్ష్యం
ఏనుగుల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సమస్యను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఐదేళ్లుగా ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– ఎన్‌.ఆదినారాయణ, చిన్నబగ్గ, సీతంపేట

ఒడిశా అడవుల్లోకి తరలిస్తున్నాం
ప్రస్తుతం ఏనుగుల గుంపును ఒడిశా అడవుల్లోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏనుగులకు ఎటువంటి హాని జరగకుండా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాటిని కవ్వించే చర్యలు చేపట్టవద్దని ప్రజలను కోరుతున్నాం. నిత్యం ఏనుగుల కదలికలపై నిఘా వేస్తున్నాం.
– జి.జగదీష్, ఫారెస్ట్‌ రేంజర్, పాలకొండ


గిరిజనుల ప్రాణాలతో చెలగాటం వద్దు
ఏనుగులు తరలిస్తున్నామంటూ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారే తప్ప వాటిని తరలించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది.
– విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ

మరిన్ని వార్తలు