బాబు పాలన బాగోలేదు

9 Jun, 2018 02:36 IST|Sakshi

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘సమయం’ వెబ్‌సైట్‌ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడి

చంద్రబాబుపై ఒపీనియన్‌ పోల్‌లో 57 శాతం మంది పెదవి విరుపు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి విశృంఖలమైందని,  సమర్థవంతమైన పాలనను అందించడంలో ఆయన దారుణంగా విఫలమయ్యారని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ గ్రూపునకు చెందిన తెలుగు వెబ్‌సైట్‌  ‘సమయం’ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(ఒపీనియల్‌ పోల్‌)లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా పోల్‌ నిర్వహించినట్లు ‘సమయం’ తెలిపింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో, రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని 60 శాతం మందికి పైగా ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అమరావతికి ఉపయోగ పడలేదని తేల్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ జోక్యం పెరిగిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.

టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సరికాదని 80 శాతం మంది సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అనే ప్రశ్నకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే తమ ఓటని సర్వేలో పాల్గొన్న అత్యధిక శాతం మంది స్పష్టం చేయటం గమనార్హం.

మరిన్ని వార్తలు