ఐటీ కొలువుల వెలుగులు

18 Dec, 2019 04:57 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షల మందిని నియమించుకున్న సంస్థలు 

వచ్చే ఆర్థిక సంవత్సరం ఉద్యోగాల్లో 10 శాతం వృద్ధి నమోదు 

2019–20 తొలి ఆరు నెలల్లో 64,442 మందికి టాప్‌–5 కంపెనీల్లో అవకాశాలు   

సాక్షి ప్రతినిధి, అమరావతి:  ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త. దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ.. ఐటీ రంగంలో మాత్రం అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు లాభిస్తుందని పేర్కొంటున్నారు. దేశ విదేశాల్లో ఐటీ, డిజిటలైజేషన్‌పై వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వివిధ ఐటీ కంపెనీలు 1.8 లక్షల మందిని ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు అంచనా. అందుకు అనుగుణంగా వ్యాపారమూ పెరిగిందని ఐటీ పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. 2020–21 ఆరి్థక సంవత్సరంలో ఉద్యోగాల సంఖ్యలో కనీసం 10 శాతం వృద్ధి ఉంటుందని, వచ్చే సంవత్సరం భారత ఐటీ కంపెనీలు కనీసం
2 లక్షల మందిని కొలువుల్లోకి తీసుకుంటాయని నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి.  

టాప్‌–5 కంపెనీల్లోనే 40 శాతం నియామకాలు   
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో, టెక్‌ మహీంద్ర దేశంలో టాప్‌–5 కంపెనీలు. దేశంలోని మొత్తం నియామకాల్లో 40 శాతం ఈ 5 కంపెనీల్లోనే ఉంటాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో ఈ 5 కంపెనీల్లో 64,442 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎంట్రీ స్థాయిలోనే ఉద్యోగాల్లో చేరారు. మిడిల్‌–సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగాల అవసరం పెద్దగా ఉండదని నియామక సంస్థలు చెబుతున్నాయి. రానున్న ఆరి్థక సంవత్సరంలో కనీసం 80 వేల ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు ఈ 5 కంపెనీల్లో వస్తాయని అంచనా వేస్తున్నారు.   

నియామకాల్లో టీసీఎస్‌ టాప్‌
అత్యధిక మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్న కంపెనీల్లో టీసీఎస్‌ సంస్థ తొలిస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలో 30 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెరుగుతుందని నియామక సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది భారీగా రిక్రూట్‌మెంట్‌ జరిగే అవకాశాలున్నాయని టీసీఎస్‌  సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు చెప్పారు.  

పెరగనున్న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు  
దేశంలో జరిగే మొత్తం ఐటీ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా కనీసం 20 శాతం ఉంటుందని టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. ఈ మేరకు క్యాంపస్‌ రిక్రూంట్‌మెంట్లు పెరుగుతాయన్నారు. టాప్‌ కాలేజీలకే కాకుండా.. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలలకు సైతం వెళ్లి నియామకాలు చేపట్టాలనే యోచన ఉందన్నారు. కేవలం ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా డిగ్రీ విద్యార్థులనూ ఉద్యోగాల్లో చేర్చుకోనున్నామని వివరించారు.   

ఐటీ ఒక్కటే ప్రత్నామ్నాయం..  
కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉత్పత్తి రంగంలోని కంపెనీలు నియామకాలు తగ్గించాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాల కోసం విద్యార్థులు అన్వేíÙస్తారు. వారి ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఐటీ రంగం. ఐటీ కంపెనీలకు సైతం కొత్త ఉద్యోగుల అవసరం ఉంది. ఈ రంగంలో నియామకాలు పెరగడం వారికి కొంత ఊరట. ఐటీ రంగంలో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశం.  
 – మహేష్‌ పెరి, చైర్మన్, ‘కెరీర్‌ 360’   

ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది  
ఐటీ రంగంలో బాగా నైపుణ్యం ఉన్న సిబ్బంది భారత్‌లో సులభంగా దొరుకుతారు. అందువల్ల వివిధ గ్లోబల్‌ కార్పొరేట్‌ కంపెనీలు మన దేశంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్‌ పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లలో చాలా కంపెనీలు ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. ఫలితంగా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఎంట్రీ స్థాయిలో ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. మిడిల్, సీనియర్‌ స్థాయి ఉద్యోగాల అవసరం కొంత తక్కువగానే ఉంటుంది’’  
– కల్పన, హెచ్‌ఆర్‌ హెడ్, ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్స్‌   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా