'సమైక్య శంఖారావాన్ని అడ్డుకుంటామనడం అప్రజాస్వామికం'

5 Oct, 2013 02:40 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో జరుప తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభను అడ్డుకుంటామని ప్రకటించడం అప్రజాస్వామికమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎల్‌బీ స్టేడియంలో బహిరంగసభకు అనుమతివ్వాలని కోరుతూ పార్టీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్‌లతో కూడిన బృందం శుక్రవారం డీజీపీ బి.ప్రసాదరావుకు వినతిపత్రం సమర్పించింది. శాంతియుతంగా సభను నిర్వహించుకుంటామని, 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎల్‌బీ స్టేడియంలో సభకు అనుమతివ్వాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 
 
 స్టేడియం నిర్వాహకులకు ఇప్పటికే లేఖ అందించామని తెలిపారు. నగర పోలీసులతో మాట్లాడిన అనంతరం సభ అనుమతిపై స్పష్టం చేస్తానని డీజీపీ తమకు హామీ ఇచ్చారని వైఎస్సార్‌సీపీ నేతలు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కొన్ని పార్టీలు, ప్రజా సంఘాలు సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని, దానిని అడ్డుకోవడం మంచిదికాదని సూచించారు.  తెలంగాణవాదం బలహీనమైనదిగా భావిం చినందునే సమైక్య శంఖారావాన్ని అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారని విమర్శించారు.
>
మరిన్ని వార్తలు