చెప్పిందేమిటి.. చేసిందేమిటి?

25 Mar, 2015 01:45 IST|Sakshi
చెప్పిందేమిటి.. చేసిందేమిటి?

విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష నేత వైఎస్ జగన్
 
హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా  అదే పద్దతిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. పరిశ్రమలకు సైతం చార్జీలు క్రమంగా తగ్గించారన్నారు. రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీల పెంపుపై శాసనసభలో మంగళవారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అనంతరం దానిపై విపక్ష నేత మాట్లాడారు. చార్జీల పెంపునకు కారణాలేంటో తెలపాలని సర్కారును నిలదీశారు. చంద్రబాబు చక్కటి అబద్ధాలు, కథలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను మరుగున పర్చడం ఎవరి వల్లా కాదని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కరెంటు రేట్లు పెంచితే సర్కారుపై తిరగబడండి’ అంటూ పిలుపునిచ్చి, అధికారంలోకి రావడంతోనే చార్జీలు పెంచడం న్యాయమేనా అని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దండిగా చార్జీలు పెంచారని, తాను ముఖ్యమంత్రి కావడంతోనే చార్జీలు తగ్గిస్తానని మీరిచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అధికారంలోకి రాగానే ప్రజలతో పనైపోయిందా? అంటూ నిగ్గదీశారు.
 
 ►  బొగ్గు రేటు తగ్గినా.. భారం ఎందుకు?
 
 విద్యుత్ చార్జీలు పెంచడానికి సహేతుక కారణాన్ని ప్రభుత్వం చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు టన్ను ధర 102 నుంచి 60 డాలర్లకు తగ్గిందని, కోల్ ఇండియా సరఫరా చేసే బొగ్గు ధరలూ తగ్గాయని తెలిపారు. ఈ పరిస్థితిల్లోనూ విద్యుత్ చార్జీల భారం ఎందుకు వే యాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దిగిపోయే ముందే 23 వేల కోట్ల భారం వేశారని చెప్పే మీరే, ప్రజలపై భారం పడేలా చార్జీలు ఎం దుకు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం అదనంగా 304 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నట్టు చె ప్పారని, డిమాండ్ ఎక్కువగా ఉండే వేసవి కాలంలో అతి తక్కువ రేటుకే విద్యుత్ వస్తున్నా... ఇంకా చార్జీలు పెంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
 
►  పీపీఏల కోసం చార్జీలు పెంచుతారా?
 
చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, పెంపు ఎంతమాత్రం న్యాయ సమ్మతం కాదని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ డిమాండ్‌ను ఎక్కువ చేసి చూపారన్నారు. యూనిట్  విద్యుత్‌నుఏకంగా రూ. 5 నుంచి రూ.10 వరకు వెచ్చించి కొనేందుకు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నారని, ఇప్పుడు కొనకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. కేవలం పీపీఏల కోసమే ప్రజలపై చార్జీల భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని, దీన్ని వైఎస్సార్‌సీపీ గట్టిగా వ్యతిరేకిస్తోందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
 ►  ఇదేనా సామాన్యుడిపై మీ కనికరం!
 

బడుగు, బలహీనవర్గాలపై ఎలాంటి విద్యుత్ భారం వేయలేదన్న ప్రభుత్వ వాదన సత్యదూరమని విపక్ష నేత స్పష్టం చేశారు. 200 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ. 6.70 మేర చార్జీ పెంచారని గుర్తుచేశారు. పేద, మధ్య తరగతి వర్గాల కనీస అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటే, విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటే అవకాశమే ఉందని, అందువల్ల వాళ్ళంతా చార్జీల భారం మోయాల్సిందేనని జగన్ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ చార్జీలు మరే పొరుగు రాష్ట్రాల్లోనూ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు గత 9 ఏళ్ళ పాలనలో ఏయేటికాయేడు విద్యుత్ చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 1995-96లో 19 శాతం, 96-97లో 32 శాతం, 98-99లో 10 శాతం, 2000-01లో 14.8 శాతం విద్యుత్ చార్జీలు పెంచారని తెలిపారు.
 
  విప్ జారీ చేసి మరీ కాపాడారే!
 
 కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచారని, రూ.23,456 కోట్ల భారం వేశారని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు.. ఆ రోజు ఎందుకు నిద్రపోయారని ప్రశ్నించారు. దారుణంగా చార్జీలు పెంచుతున్నారని ఒక్క టీడీపీ మినహా ప్రతిపక్షాలన్నీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే, చంద్రబాబునాయుడు తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ రోజు ఆ పనిచేయకుండా ఉంటే, ప్రజలపై ఇంత భారం పడేదా? ఈ రాష్ట్ర విభజన జరిగేదేనా? అని ప్రశ్నించారు. ఆ రోజున ఉన్నది తెలుగు కాంగ్రెస్సే కదా అంటూ టీడీపీని ఎద్దేవా చేశారు.
 
  సైకో ఎవరో? మీ మనస్సాక్షినే అడగండి
 
జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు ఎప్పటిలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వైపు నుంచి దొర్లిన ఓ మాటకు ప్రతిపక్ష నేత బదులిస్తూ.. ‘చంద్రబాబును సైకో అంటారో... నన్ను అంటారో... మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. ఎవరు కళ్ళు పెద్ద పెద్దవి చేసి మరీ భయపెడతారో అందరికీ తెలుసు. ప్రజలంతా చూస్తున్నారు’ అని అన్నారు.
 

మరిన్ని వార్తలు