‘పబ్లిసిటీ పిచ్చితో రోడ్డున పడేశారు’

8 Jun, 2017 15:45 IST|Sakshi
‘పబ్లిసిటీ పిచ్చితో రోడ్డున పడేశారు’

విశాఖపట్నం:  విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని స్వయంగా కలెక్టరే చెప్పారని గుర్తు చేశారు. విశాఖలో భూముల కబ్జాలపై గురువారం వివిధ పార్టీ నేతలంతా కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

దీనికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అమర్నాథ్‌, సీపీఎం నేత నర్సింగరావు, సీపీఐ నేత స్టాలిన్‌, లోక్‌సత్తా నేత బాబ్జీ, బీఎస్పీ నేత బంగారి పలువురు విద్యావేత్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారంతా మాట్లాడారు. అవేంటో ఒకసారి గమనిస్తే..

విజయసాయిరెడ్డి: ‘భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని కలెక్టరే చెప్పారు. అధికార పార్టీ నేతలకు భూకబ్జాలతో సంబంధం ఉంది. పలువురు మంత్రులు పాత్ర కూడా ఉంది. భూకబ్జాలపై వచ్చే నెల 14న హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలుస్తాం. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తాం. ఈ నెల 15న కలెక్టరేట్‌లో పబ్లిక్‌ హియరింగ్‌లో ప్రజావాణిని వినిపిస్తాం. బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది.

బొత్ససత్యనారాయణ: ‘రాష్ట్రంలో అవినీతి మరోసారి బట్టబయలైంది. అసెంబ్లీలో వర్షపు నీరు లీకుపై స్పీకర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం. కుట్ర జరిగిందని చెప్పి స్పీకర్‌ పక్కదారి పట్టిస్తున్నారు. అసెంబ్లీలో డొల్లతనం ఒక్క వర్షానికే తేటతెల్లమైంది. చదరపు అడుగు నిర్మాణానికి రూ.రెండు వేలకు బదులు రూ.తొమ్మిది వేలు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ వ్యాఖ్యలకు, స్పీకర్‌ వ్యాఖ్యలకు పొంతనే లేదు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌కే విచారణను పరిమితం చేయడమేమిటి? మొత్తం లీకులపై దర్యాప్తునకు ఆదేశించండి’

సీపీఎం నేత నర్సింగరావు: ‘కంప్యూటరీకరణ పేరుతో టీడీపీ నేతలు భూములు కొల్లగొట్టారు. అసైన్డ్‌ భూములను వదిలిపెట్టలేదు. భూకబ్జాల విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, బీజేపీ ఎల్పీ నేత విష్ణు కుమార్‌ రాజు మాటపై నిలబడాలి. భూములు కోల్పోయిన బాధితుల పక్షాన మేం ఉంటాం. అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకునే వరకు వదిలపెట్టం’

సీపీఐ నేత స్టాలిన్‌: ‘పేదల భూములను అధికార పార్టీ నేతలు గద్దల్లా తన్నుకెళ్లారు. పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం’

లోక్‌సత్తానేత బాబ్జీ:‘ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పట్టింది. బాధితులు రోడ్డున పడ్డా కనీస స్పందన లేదు’