బత్తాయి..చవకోయి..!

20 May, 2020 13:09 IST|Sakshi

పొదుపు సభ్యులకు రూ.100కి పది కిలోలు  

మార్కెట్లో రేటు కంటే మూడు రెట్లు తక్కువ   

రెండు వేల టన్నుల బత్తాయిల అమ్మకాలే టార్గెట్‌  

ఇప్పటి వరకు 940 టన్నుల అరటి అమ్మకాలు  

అరటి అమ్మకాల్లో జిల్లాకు ప్రథమ స్థానం  

ఒంగోలు టూటౌన్‌:  కరోనా నివారణ నేపథ్యంలో లాక్‌డౌక్‌లో ఉన్న పొదుపు మహిళలకు మంచి ఆరోగ్యకరమైన ఫలాలను తక్కువ ధరకు అందించే కార్యక్రమం సర్కార్‌ చేపట్టింది. కోవిడ్‌–19 ఎదుర్కొనేందుకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు వెలుగు ద్వారా అరటి అమ్మకాలు చేపట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. అన్ని జిల్లాల్లో కంటే ప్రకాశం జిల్లాలో 940 మెట్రిక్‌ టన్నుల అరటి అమ్మకాలు చేసి డీఆర్‌డీఏ–వెలుగు అధికారులు ప్రభుత్వ ప్రశంసలు పొందారు. లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో మళ్లీ ఇప్పటి నుంచి బత్తాయి అమ్మకాలను పొదుపు సంఘాల ద్వారా సర్కార్‌ చేపట్టింది. అనంతపురం, కడప జిల్లాల్లోని రైతుల వద్ద బత్తాయిలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ప్రతి పొదుపు సభ్యురాలి కుటుంబానికి అతి తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రెండు వేల టన్నుల బత్తాయిలు అమ్మాలని డీఆర్‌డీఏ–వెలుగు అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే తొలివిడతగా జిల్లాకు 70 టన్నుల బత్తాయిలుదిగుమతి అయ్యాయి. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ, వెలుగు శాఖల సమన్వయంతో జిల్లాకు చేరిన బత్తాయిలను ఆయా మండలాల్లోని వీవోఏలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తొలివిడతలో వేటపాలెం, పర్చూరు, కారంచేడు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు, కొత్తపట్నం మండలాలకు చెందిన వీవోఏలకు బత్తాయి దిగుమతి చేశారు.  ప్రభుత్వం బత్తాయిలను కిలో పది రూపాయలకు కొనుగోలు చేసి సబ్సిడీపై ఇస్తోంది. బయట మార్కెట్లో మూడు కిలోల బత్తాయి రూ.100 అమ్ముతుండగా ప్రభుత్వం మాత్రం రూ.100 లకి పది కిలోల బత్తాయి అందిస్తోంది. అంటే బయట మార్కెట్‌లో కంటే మూడు రెట్లు తక్కువ ధరకు నాణ్యమైన బత్తాయిని పేదలకు ఇస్తోంది. అయితే బత్తాయి తోటలు ఉన్న పశ్చిమ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో ఆయా మండలాల ఏపీఎంలు వాటి అమ్మకాలకు అనుమతులు తీసుకోలేదు. మిగిలిన మండలాల్లో  పొదుపు సంఘాల ద్వారా  అమ్ముతున్నారు.   

బత్తాయి అమ్మకాల్లో కూడా ముందుంటాం
ఇప్పటి వరకు అరటి అమ్మకాల్లో అన్ని జిల్లాల కంటే అత్యధికంగా అమ్మి జిల్లాకు ప్రథమ స్థానం తీసుకొచ్చాం.  బత్తాయి పండ్లను చాలా తక్కువ ధరకు ప్రభుత్వం పేదలకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అటు రైతులకు ఇటు పేదలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలను సర్కార్‌ చేపట్టింది. – జె. ఎలీషా, డీర్‌డీఏ పీడీ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా