పారదర్శకతకు అసలైన అర్థం

27 Jul, 2019 04:46 IST|Sakshi

ముందస్తు న్యాయ పరిశీలన బిల్లుపై సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌  

సాక్షి, అమరావతి: ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు పారదర్శకతకు అసలైన అర్థం చెబుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. టెండర్ల విధానంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాలు (న్యాయపరమైన ముందస్తు పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంపై సీఎం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు ఆమోదం అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగన్నారు. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సరైన సందేశం పంపించామన్నారు. రూ.100 కోట్లు, ఆపై ఏ టెండరైనా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నియమించే సిట్టింగ్‌ లేదా రిటైర్డ్‌ జడ్జికి పంపుతామని, ఆయన ఆదేశాలను తప్పక పాటిస్తామని ఈ ట్వీట్‌లో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

కార్గిల్‌ అమర వీరుల త్యాగాన్ని ఈ దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది
కార్గిల్‌ యుద్ధ అమరవీరులు చేసిన త్యాగానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారి త్యాగాన్ని, ఆ వీరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ట్వీట్‌ చేశారు. ‘భారతదేశ పరిరక్షణలో అమరులై కార్గిల్‌ యుద్ధంలో ఘన విజయం సాధించిన వీరులకు కృతజ్ఞతాంజలులను ఘటిస్తున్నాను. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ యోధుల త్యాగ నిరతిని, వీరోచిత సాహసాన్ని ఈ దేశం ఎన్నటికీ మరువదు’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు