అందరూ ఉన్నా..అనాథలే!

20 Mar, 2020 12:34 IST|Sakshi

రైలు ప్రమాదాల్లో పెరుగుతున్న మృతులు

మృతుల్లో గుర్తు తెలియని వారే అధికం

ఏడాదిలో చనిపోయింది 24 మంది

చీరాల అర్బన్‌: వారి ఊరు తెలియదు..పేరు తెలియదు..ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రం..బతుకు పోరులో పయనమైన వారు కొందరైతే..చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే వారు మరికొందరు. కిక్కిరిసిన రైళ్లలో వేళాడుతూ ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మరణించిన వారి చిరునామా తెలియదు. కొద్ది రోజుల తర్వాత అందరూ ఉన్నా అనాథ శవంలా కాలిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యం. జీవితాన్ని కొందరు అందంగా తీర్చిదిద్దుకుంటారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి కుటుంబాన్ని ఏర్పరుచుకుంటాం. బంధాలు, అనుబంధాలను పెంచుకుని వాటిని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైలులో ప్రయాణించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం, కిక్కిరిసిన రైళ్లలో వేళాడుతూ ప్రయాణాలు చేసే వారు ఎక్కువ మంది మరణిస్తున్నారు. విజయవాడ–చెన్నై రైలు మార్గంలో నిత్యం ఎన్నో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గం ఉంది. ఈ మార్గంలో సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వెళ్తుంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జనరల్‌ బోగీల్లో ఫుట్‌పాత్‌పై కూర్చొని ప్రయాణిస్తూంటారు. ఈ నేపథ్యంలో కొందరు అలా ప్రయాణిస్తూ రైలు నుంచి జారి పడి మృత్యువాత పడుతున్నారు. ఇలా మృతి చెందిన వారి వివరాలు లభించవు. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తుతెలియని మృతదేహాలుగా కేసులు నమోదవుతున్నాయి.

చీరాల ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధి స్టువార్టుపురం నుంచి ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్‌ వరకు ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో రైలు నుంచి జారిపడి మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారు. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు చీరాల జీఆర్పీ పరిధిలో మొత్తం 24 మంది రైలు నుంచి జారిపడి మృతి చెందగా వీరి వివరాలు లభించక పోవడంతో గుర్తుతెలియని మృతదేహాలుగా కేసులు నమోదు చేశారు. ప్రయాణికులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దూర ప్రాంతాలకు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందుతున్నారు. ఇటీవల అస్సోం, జార్ఖండ్, డెహ్రడూన్‌ వంటి ప్రాంతాలకు చెందిన వారు జారిపడి మృతి చెందారు. ఇలా మరణించిన వారిలో కొందరి వద్ద దొరికిన చిన్న చిన్న ఆధారాలతో మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చేందకు జీఆర్పీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శరీరం బాగానే ఉంటే వారి ఫొటోలను పరిసర ప్రాంతాల పోలీసుస్టేషన్లకు పంపుతుంటారు. కొన్ని మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్ట లేనంతగా మారతాయి. ఆత్మహత్యలు చేసుకొనే వారు, పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందిన వారి మృతదేహాలు కూడా ఒక్కోసారి ఛిద్రమై పోవడంతో వారు స్థానికులైనా గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉంటుంది. దీంతో అనాథ శవాలుగా మిగిలిపోతున్నారు. రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుంటారు. రైలు ప్రమాదాల్లో మరణించిన వారి శరీరం రెండు, మూడు రోజులకే కుళ్లిపోతుంది. పోస్టుమార్టం చేసినా వాటిని భద్రపరిచేందుకు చీరాల ఏరియా వైద్యశాలలో ఫ్రీజర్‌ బాక్సులు లేకపోవడంతో వాటిని మార్చురీలోనే ఉంచుతున్నారు. మూడు రోజులు దాటినా వారి తరఫున ఎవరూ రాకపోవడంతో జీఆర్పీ పోలీసులే వాటిని ఖననం చేయిస్తున్నారు. అందరూ ఉన్నా అనాథ శవాలుగా భూమిలో కలిసిపోతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. 

ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు  
కష్టాలను అధిగమించలేక, సమస్యలకు పరిష్కార మార్గం దొరకలేదనో ఎక్కువ మంది రైలు కిందపడి మరణిస్తున్నారు. ఈ తరహా ఆత్మహత్యలు అధికంగానే జరిగాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలకు పాల్పడటంతో కన్న వారికి కడుపుకోత మిగులుతోంది. ప్రేమ విఫలమైందనో, ప్రేమ పెళ్లికి కన్న వారు అంగీకరించ లేదనో రైలు కిందపడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. చీరాల రైల్వేస్టేషన్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్‌లో 2019లో మొత్తం రైలు ఢీకొని, జారిపడి మృతి చెందిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో ఎక్కవ మందిని గుర్తించగా మరికొందరు వివరాలు ఇప్పటికీ తెలియదు. జేబులో దొరికే ఆధార్‌ కార్డు సాయంతో కొందరి చిరునామా దొరికింది. మరికొందరు శరీరాలు ఛిద్రమై పోవడంతో వారి ముఖం కూడా కనిపించక అనాథ శవాలుగా మిగిలిపోయారు.

మరిన్ని వార్తలు