నువు లేక అనాథలం

5 Apr, 2018 09:38 IST|Sakshi
వైష్ణవితో పాటు తమ్ముడు, చెల్లి.. వీరు తలదాచుకుంటున్న పంపు హౌస్‌

పాపం పసివాళ్లు చిన్న వయస్సులో  పెద్ద పరీక్ష

వ్యాధులతో తల్లిదండ్రుల కన్నుమూత

అనాథలుగా పస్తులు

తమ్ముడు, చెల్లిని ఓదార్చలేక పదో తరగతి బాలిక అవస్థలు

పంప్‌హౌస్‌లో భారంగా బతుకు

‘‘ఆ రోజు డిసెంబర్‌ 22, 2017. రాత్రి 7 గంటల సమయంలో నాతో పాటు తమ్ముడు, చెల్లెని అమ్మ తన వద్ద కూర్చోబెట్టుకుంది. కళ్ల నిండా నీళ్లతో మా తల నిమురుతూ ‘నాన్న చనిపోయాడు.. నా పరిస్థితి అప్పుడో ఇప్పుడో అన్నట్లుంది. మీకంటూ ఏమీ మిగల్లేదు. నేను కూడా పోతే మీకు దిక్కెవరమ్మా..’ అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. అలా మాటలు చెబుతూనే అన్నం కూడా తినకుండా అందరం నిద్రలోకి జారుకున్నాం.

మరుసటి రోజు బడికి వెళ్లేందుకని సిద్ధమవుతూ అమ్మను లేపినా ఉలుకూపలుకూ లేకపోయింది. నిద్రపోతుందనుకున్నాం. ఉదయం 8 దాటినా లేవకపోవడం.. లేమ్మా అని పిలిచినా పలక్కపోవడంతో చుట్టుపక్క వాళ్లను పిలిచి చూపించినాం. వాళ్లు వచ్చి చూసి ‘మీ అమ్మ చనిపోయిందని చెప్పినారు.’ మాకేం చేయాలో దిక్కుతోచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దారీతెన్నూ లేని జీవితం గడుపుతున్నాం. ఇదిగో ఈ పంప్‌హౌస్‌లోనే కాలం గడుపుతున్నాం.’’ – వైష్ణవి

కదిరి (అనంతపురం జిల్లా) : ‘‘అమ్మానాన్న లేని లోకం శూన్యంగా ఉంది. తమ్ముడు, చెల్లిని బాగా చూసుకోవాలని.. చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని ఇటీవల పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ్ముడు పురుషోత్తం 7వ తరగతి, చెల్లి స్వాతి 3వ తరగతి చదువుతోంది. అమ్మానాన్న గుర్తుకొచ్చివీళ్లిద్దరూ ఏడుస్తుంటే ఓదార్చేందుకు నావల్ల కావట్లేదు. పనికి వెళ్దామన్నా పిల్లలను వదిలి ఉండలేను. ఎం పని చేయాల్నో కూడా నాకు తెలియదు. ఇప్పటికైనా అమ్మ తెచ్చిపెట్టిన గింజలతో కడుపు నింపుకుంటున్నాం. నాకేమో బాగా చదువుకోవాలనుంది.’’ చెమర్చిన కళ్లతో వైష్ణవి చెబుతున్న మాటలు వింటే పాషాణ హృదయం కూడా ఇట్టే ద్రవిస్తుంది. వైష్ణవితో పాటు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఈ పిల్లల దీనావస్థ ఇదీ..

తండ్రికి క్షయ.. తల్లికి క్యాన్సర్‌
తలుపుల మండల కేంద్రానికి చెందిన చాకలి అరుణమ్మను వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట మండలం కొండలవాండ్లపల్లికి చెందిన చాకలి సుబ్బరాయుడుకిచ్చి కొనేళ్ల క్రితం వివాహం జరిపించారు. అక్కడ కొంతకాలం కుల వృత్తిని చేసుకుంటూ గడిపినా.. ఆ తర్వాత భర్తతో కలిసి తన పుట్టినిల్లు అయిన తలుపులకు వచ్చి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో భర్తకు క్షయ వ్యాధి సోకి మంచం పట్టాడు. ఎలాగైనా కాపాడుకునేందుకు తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చికిత్స చేయించింది. కుల వృత్తితో సంపాదించిన డబ్బంతా వైద్యానికే సరిపోయింది. దొరికిన చోటల్లా అప్పు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఏడాది క్రితం సుబ్బరాయుడు కన్నుమూశాడు.

ఉన్న ఒక్కగానొక్క ఆసరా కూడా దూరం కావడంతో ఆమె కుమిలిపోయింది. పిల్లలను చూసి ధైర్యం కూడగట్టుకుంది. కుల వృత్తితోనే సంసారం నెట్టుకొచ్చింది. ఇంతలో విధి మరోసారి పరీక్ష పెట్టింది. ఒక రోజు విపరీతమైన దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం వచ్చింది. కదిరిలో వైద్యులతో పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్‌గా నిర్ధారించారు. అయితే ఉన్న డబ్బంతా భర్త ఆరోగ్యానికే ఖర్చయిపోవడంతో దేవునిపైనే భారం వేసి ఇంటి ముఖం పట్టింది.

ఇల్లు ఖాళీ చేయండి
క్యాన్సర్‌ వ్యాధి సోకిందనే బాధతో పిల్లల భవిష్యత్తు తలుచుకొని ఇంటి ముఖం పట్టిన అరుణమ్మకు పిడుగులాంటి వార్త ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంటి యజమాని వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. మరో ఇంటి కోసం ఊరంతా తిరిగినా అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గ్రామ పెద్దలు కనికరించడంతో ఆంజనేయస్వామి గుడిలో తలదాచుకున్నారు. చివరకు అక్కడ ఉండేందుకు కూడా కొందరు ఆక్షేపించారు. మళ్లీ వీధినపడ్డారు. ఒంటరి మహిళ.. ముగ్గురు పిల్లలతో పడుతున్న బాధలను చూసి కొందరు పెద్దలు ఊరికి మంచినీళ్లు సరఫరా చేసే పంపు రూంలో ఉండేందుకు గ్రామస్తులను ఒప్పించారు.

ఉన్న తిండి గింజలతోనే..
అమ్మానాన్నలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ పిల్లల బతుకు భారంగా మారింది. ఎవరిని అడగాలో తెలియదు.. ఎం చేయాలో పాలుపోదు. అమ్మా బతికుండగా పోగు చేసిన తిండి గింజలతోనే ఒక పూట తింటూ ఇంకో పూట కడుపులో కాళ్లు పెట్టుకుని నిద్రిస్తున్నారు. ఎవరో ఒకరు దయతలిస్తే కాస్త గంజి పడుతున్నారు. ఇక రాత్రిళ్లు వీరి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. తల్లి పొత్తిళ్లలో తలదాచుకున్న చిన్నారులకు పొద్దుగూకే కొద్దీ భయం వెంటాడుతోంది. పెద్ద దిక్కుగా మారిన వైష్ణవికి వెన్నులో వణుకు వస్తున్నా తమ్ముడు, చెల్లికి ధైర్యం చెబుతూ నిద్రపుచ్చుతోంది.

(ఈ వార్తకు స్పందించి ఇప్పటికే అనేక మంది సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఆ చిన్నారుల కాంటాక్ట్‌ ఫోన్‌ నెంబర్‌ కావాలని ‘సాక్షి’ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం వారి వద్ద ఎలాంటి ఫోన్‌ లేదు. ఎవరైనా సాయం చేయాలంటే కింద ఇచ్చిన బ్యాంక్‌ అకౌంట్‌ లో నగదు వేయగలరు)

దాతలు స్పందించాలనుకుంటే..
ముళ్లపతి వైష్ణవి
ఆంధ్రా బ్యాంకు(తలుపుల శాఖ) ఖాతా నెం. 057010100175499
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : ఏఎన్‌డీబీ0000570 ఎంఐసీఆర్‌ కోడ్‌ 515011762

మరిన్ని వార్తలు