ఓర్వకల్లులో యుద్ధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం

14 Sep, 2014 00:07 IST|Sakshi
ఓర్వకల్లులో యుద్ధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ఏర్పాటు కాబోతుంది. కేంద్రం నవ్యాంధ్రప్రదేశ్‌కు ఈ పరిశ్రమను మంజూరు చేయగా ఇప్పటికైనా వివిధ జిల్లాల్లో భూములను పరిశీలించిన ప్రత్యేక బృందం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే డీఆర్‌డీఓ దేశంలోనే కీలకమవుతుంది. యుద్ధ సామాగ్రికి అవసరమైన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, గన్స్ వంటివి ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. డీఆర్‌డీఓ నెలకొల్పేందుకు 2500 ఎకరాల భూములు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది. శనివారం ఓర్వకల్లు ప్రాంతంలో డీఆర్‌డీఓ ఉన్నతాధికారి కల్నల్ రాజు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పర్యటించి భూములను పరిశీలించింది. అనంతరం జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్‌తో క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. డిఫెన్స్, రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ఏర్పాటు కోసం రక్షణ శాఖ ఐదు దశల్లో రూ.5 వేల కోట్లు వ్యయం చేయనుందని వెల్లడించారు. డీఆర్‌డీఓను జిల్లాలో నెలకొల్పేందుకు ఉన్నతాధికారుల బృందం సానుకూలత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఇందులో జిల్లా వాసులకు 4 వేల నుంచి 5 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు