ఆధ్యాత్మిక సంపద మన సొంతం

16 Aug, 2014 03:45 IST|Sakshi
ఆధ్యాత్మిక సంపద మన సొంతం

తిరుపతి సిటీ : భారతీయులుగా మనకున్న ఆధ్యాత్మిక, ధార్మిక సంపద ప్రపంచంలో ఏ దేశానికీ లేదని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ.గోపాల్ ఉద్ఘాటించారు. శుక్రవారం ఉదయం స్థానిక టీటీడీ పరిపాలన భవనం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పరేడ్ ఇన్‌చార్జి కూర్మారావు నుంచి గౌరవవందనం స్వీకరించారు.

అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల మీద ప్రమాణం చేసి న్యాయస్థానాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే భారతీయుల ఆధ్యాత్మిక సంపద ఎంత ప్రాశస్త్యమైందో అర్థమౌతుందున్నారు. శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులకు, అంకిత భావంతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రానున్న ఏడాది కాలంలో నూతనంగా అమలు చేయనున్న వాటిని వివరించారు.
 
చేపట్టనున్న నూతన కార్యక్రమాలు..
 
శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా 18 వేల రూ.300 శీఘ్రదర్శన టికెట్లను ఈ-దర్శన్, ఇంటర్నెట్ ద్వారా కేటాయింపు.
 
తిరుమలలో రూ.50 కోట్లతో సువిశాలమైన కారు పార్కింగ్ ఏర్పాటు.
 
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెంట్లలో 108 అంగుళాల ప్లాస్మా టీవీలు, భక్తుల భద్రతను పటిష్ట పరిచేందుకు 2 వేల సీసీ కెమెరాల ఏర్పాటు.
 
తిరుచానూరులో నూతన అన్నదాన భవనం, యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం.
 
శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో రూ.70 కోట్ల వ్యయంతో ప్రత్యేక వసతి సముదాయం.
 
దేశవాళీ గోజాతిని అభివృద్ధి పరిచేందుకు పలమనేరు వద్ద 450 ఎకరాల్లో థీమ్‌పార్క్ ఏర్పాటు.
 
ఆకట్టుకున్న విన్యాసాలు..

టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో పరేడ్‌లో నిర్వహించిన కవాతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు చేపట్టిన గుర్రపుస్వారీ, టీటీడీ డాగ్ స్క్వాడ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన డాగ్‌షో విశేషంగా ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ఈవో ఎంజీ గోపాల్ వెండి డాలర్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డీఎల్‌వో నాగార్జున, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖరరెడ్డి, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఇతర విభాగాధిపతులు, ఉగ్యోగులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు