అవినీతిని సహించం

21 Jun, 2019 11:43 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న అవంతి శ్రీనివాసరావు

పేదలందరికీ సంక్షేమ ఫలాలు

ప్రభుత్వ మారింది.. పద్ధతులు మార్చుకోండి

మాది ఆఫీసర్స్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం

తొలి సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి అవంతీ దిశా నిర్దేశం

అవినీతిని ఏ మాత్రం సహించం... సమగ్రాభివృద్ధే మా అజెండా..గడిచిన 20 రోజులుగా మా ప్రభుత్వ పాలన చూస్తున్నారు. మాది ఆఫీసర్స్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకే కాదు..మీకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. మేనిఫెస్టోయే మాకు పవిత్రగ్రంథం.. దాంట్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి తీరుతాం..వాటి ఫలాలు ప్రతి పేదవానికి చేరాలా సహకరించండి. మా ఎమ్మెల్యేల నుంచి కూడా ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే మా ప్రభుత్వ «థ్యేయం..ప్రభుత్వం మారిందని గ్రహించండి..పద్ధతులు మార్చుకోండి.. పారదర్శకంగా పని చేయండి..ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేందుకు సహకరించండి’’అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) అధికార యంత్రాంగాన్ని కోరారు.రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లా సమీక్షా సమావేశం మంత్రి అవంతిశ్రీనివాస్‌ అధ్యక్షతన విశాఖ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగింది. ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, కన్నబాబురాజు,గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10గంటల నుంచిసాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన సమావేశంలో శాఖల వారీగా విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్ల తమ ప్రభుత్వ ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.             – సాక్షి, విశాఖపట్నం

విద్య, వైద్యానికి ప్రాధాన్యం: అవంతి శ్రీనివాస్‌
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అప్పులు, ఆర్థిక లోటు కలిపి రూ.2లక్షల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలుపర్చాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. కష్టపడి పనిచేసే అధికారులు, ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, పార్టీలు, రాజకీయలకతీతంగా పనిచేయాలని హితవు పలికారు. అవినీతికి పాల్పడినా, ప్రోత్సహించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

పథకాలు అందలేదని ఫిర్యాదు రాకూడదు: బూడి 
సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలు, పార్టీలకతీతంగా అందించే బాధ్యత మీదేన ని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు సూచిం చారు. మాకుఫలానా సంక్షేమ పథకం అందలేదని ఫిర్యాదు రావడానికి వీల్లేదని, అలా వస్తే మాత్రం అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్నారు. రాజన్న పాలనలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిందేనన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు.

క్వాలిటీ ఆఫ్‌ వర్క్‌ ముఖ్యం: అమర్‌నాథ్‌
మీరు ఎన్ని గంటలు పనిచేశారని కాదు..ఎంత పని చేశారన్నదే ముఖ్యం..మాకు కావాల్సింది క్వాలిటీ ఆఫ్‌ వర్కు మాత్రమేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తొలిరోజే చెప్పారు. 10 నుంచి 5 గంటల మధ్య పనిచేయండి..కానీ ఆపనిచేసిన సమయంలో అంకిత భావంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.  వైజాగ్‌ను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దాలి.

అవినీతిలో రాజీ ప్రసక్తే లేదు: రమణమూర్తిరాజు
అవినీతి రహిత పాలన విషయంలో రాజీ ప్రసక్తే లేదని యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మీకు తెలియంది కాదు.. నా నియోజక వర్గంలోనే విపరీతంగా డబ్బులు వసూలుచేశారని, క్రిమినల్‌ కేసులు ఫైల్‌ చేసేసరికి నేడు ఆ డబ్బులు తిరిగి ఇస్తున్నారు. గతప్రభుత్వంకోసం మర్చిపోండి. టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగా మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టరు.

అర్హులందరికీ అందాల్సిందే : గొల్ల
ప్రతిసంక్షేమ పథకం చిట్టచివరి లబ్ధిదారుని వరకు అంది తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. ఇప్పటికే 80 శాతం హామీలుఅమలు చేయడం ప్రారంభించాం. రానున్న ఐదేళ్లు చెప్పినవి, చేప్పనవికూడా ఎన్నో అమలుచేయబోతున్నామని చెప్పారు.

ఉద్యోగాల పేరిట దోచేశారు: అదీప్‌రాజ్‌
గడిచిన ఐదేళ్లలో మా నియోజకవర్గంలో అడ్డగోలుగా దోపిడీ జరిగిందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆరోపించారు. సబ్‌స్టేçషన్లలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట కూడా లక్షలు దోచేశారు. మా నుంచి ఎలాంటి ఆబ్లిగేషన్స్‌ ఉండవని హామీ ఇస్తున్నాం. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వారికి అందాలి.  

తొమ్మిదేళ్లుగా అవినీతిపై పోరాటం: ఉమాశంకర్‌ గణేష్‌ 
నర్సీపట్నం నియోజకవర్గంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపై పోరాటం చేస్తున్నానని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్‌ అన్నారు. గడిచిన ఐదేళ్లలో జరిగినంత అవినీతి ముందెన్నడూ జరగలేదన్నారు. నియోజకవర్గంలో ఇష్టానుసారంగా దోపిడీ జరిగిందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యంమన్నారు. 

అర్బన్‌ హౌసింగ్‌ అవినీతి మయం: మళ్ల విజయ్‌ప్రసాద్‌
అర్బన్‌ హౌసింగ్‌ అవినీతిమయమని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఆరోపించారు. గెడ్డలు, కాల్వలు కూడా ఆక్రమించి పట్టాలు మంజూరు చేశారన్నారు. పైగా గ్రూప్‌ హౌసింగ్‌ కట్టి మరీ అమ్మేసుకున్నారన్నారు. నగరంలో ఒక్క గజం కూడా భూమి వదలకుండా కబ్జా చేశారన్నారు. యూసీడీ పీడీ ఎన్నికల వరకు టీడీపీ కార్యకర్తకంటే దారుణంగా పనిచేశాడన్నారు. అర్బన్‌ హౌసింగ్‌లో జరిగిన అవినీతిపై సమగ్రవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తూర్పు బెల్టుషాపుల మయం: అక్కరమాని విజయనిర్మల
తూర్పు నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు ఉన్నాయని వాటిని నిర్మూలనకు అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల కోరారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయి స్తున్నా అధికారులుపట్టించుకోవడంలేదన్నారు. గుర్రపు పందాలు, జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు.

‘అవంతి’ మార్కు సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: తొలి సమీక్షలోనే మంత్రి అవంతి శ్రీనివాసరావు తన మార్కు చూపించారు. ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా జిల్లాపైన, శాఖల వారీగా తనకు ఏస్థాయిలో అవగాహన ఉందో తొలిసమీక్ష ద్వారా అధికారులకు తెలియజెప్పారు. గతంలో ఇలాంటి జిల్లా సమీక్షలు ఏదో మొక్కుబడి తంతుగా సాగేవి. టీడీపీ హయాంలో జిల్లా సమీక్ష అంటే  పట్టుమని నాలుగైదు శాఖలకు మించి ఏనాడు సమీక్ష జరిగిన పాపానపోలేదు. నాకెంత.. నీకెంత అనే ధోరణిలోనే అధికారులను టార్గెట్‌ చేసే విధంగా సమీక్షలు జరిగేవి.

జిల్లాలో అడుగుపెట్టింది మొదలు..
రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో కీలకమైన పర్యాటక, సాంస్కృతిక, యువజనసర్వీసుల శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన అవంతి  జిల్లాలో అడుగు పెట్టింది మొదలు తన శాఖతో పాటు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రెండు విడతలుగా తన శాఖలపై లోతైన సమీక్ష చేసిన అవంతి తొలిసారి జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధి, పెండింగ్‌ సమస్యలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ వేదికగా జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడుతో కలిసి ప్రతి శాఖపైన లోతైన సమీక్ష జరిపారు. గతంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ అవినీతి విషయంలో తమ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు.
 
చురకలు అంటిస్తూ..
నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై మంత్రి తనదైన శైలిలో చురకలు అంటిస్తుంటే..పక్కనే ఉన్న బూడి జోక్యం చేసుకుని తనదైన శైలిలో హెచ్చరికలు చూస్తూనే దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 15కు పైగా శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఒక్కోశాఖపై కనీసం 15నుంచి 20 నిమిషాల పాటు జరిగిన సమీక్షల్లో తొలుత అధికారులతో మాట్లాడిస్తూనే ఆయా శాఖల్లో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగడుతూనే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. పైగా సమీక్ష చివరి వరకు అధికారులను సమావేశంలో ఉంచకుండా సమీక్ష పూర్తికాగానే వార్ని వెళ్లిపోవాలని ఆదేశించేవారు. మొత్తమ్మీద తొలి సమీక్షలోనే ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగిన సమీక్ష పట్ల అధికారులు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తమకోసం ఇంతలా పనిచేస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధుల కోసం తాము అంకితభావంతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు