ఇసుక మరింత చౌక

8 May, 2016 03:08 IST|Sakshi
ఇసుక మరింత చౌక

అందుబాటులోకి మన ఇసుక యాప్
టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చాలు
24 గంటల్లో వస్తుందంటున్న  అధికారులు
జిల్లా అవసరాలకు ‘తూర్పు-శ్రీకాకుళం’ నుంచి ఆరిలోవలో శాండ్ డిపో పునఃప్రారంభం

 
సాక్షి, విశాఖపట్నం : ‘ఉచిత ఇసుక’ రవాణా ఖర్చులతో కలిపి సామాన్యులకు మరింత చౌకగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికే కాల్ టాక్సీల మాదిరిగా మన ఇసుక పేరిట ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కావాల్సిన రీచ్‌లో కావల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 86889-39939ను ఏర్పాటు చేశారు. గతంలో నిర్వహిం చిన ఆరిలోవ శాండ్ డిపోను మళ్లీ పునఃప్రారంభించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఇసుక కోసం శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో ఎంపిక చేసిన రీచ్‌ల నుంచి ప్రత్యేకంగా రప్పిస్తున్నా రు.

రీచ్‌ల్లో ఇసుక ఉచితంగా తవ్వుకునే అవకాశం ఉండడంతో రవాణా చార్జీల పేరిట దోపిడీని అరికట్టేందుకు కలెక్టర్ యువరాజ్, జేసీ నివాస్‌లు చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తుందనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా రీచ్‌ల్లో ఇసుక ఇంకా పూర్తిగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయా రీచ్‌లలో ఇసుకను జిల్లాలోని నిర్మాణదారులు నేరుగా తెచ్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం శ్రీకాకుళం రీచ్‌ల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా రప్పిస్తున్న ఇసుకను గతంలో మాదిరిగా ఆరిలోవ వద్ద సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నారు. కాగా శ్రీకాకుళం రీచ్‌ల నుంచి దూరాభారాన్ని లెక్కలేసిన మైన్స్ అధికారులు లారీ యజమానులతో చర్చించి రవాణా చార్జీలు మరింత తగ్గించేలా ఒప్పించారు.

దీంతో వారం రోజుల క్రితం వరకు ఉన్న రేట్లను మరింత తగ్గిస్తూ శుక్రవారం ప్రకటన చేశారు. నాలుగురోజుల క్రితం శ్రీకాకుళం నుంచి రవాణా చేసే 12 క్యూబిక్‌మీటర్(క్యూ.మీ.) ఇసుకను విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ జంక్షన్ వరకు రూ.12 వేలు నిర్ణయించగా.. తాజాగా ఆ ధరను రూ.11 వేలకు తగ్గించారు. అలాగే గాజువాక జంక్షన్ వరకు గతంలో రూ.13 వేలుగా ప్రకటించిన 12 క్యూ.మీ.ఇసుక ధరను ప్రస్తుతం రూ.1 2వేలుగా నిర్ణయించారు. అలాగే 15 క్యూ.మీ లారీ ఇసుక (12 టైర్ల లారీ)ను ఎన్‌ఏడీ వరకు గతంలో రూ.14 వేలు ప్రకటించగా.. తాజాగా రూ.13 వేలుగా నిర్ణయించారు.

గాజువాకకైతే గతంలో రూ.15 వేలుగా ప్రకటించగా.. తాజాగా ఆ ధరను రూ.14 వేలకు తగ్గించారు. ఈమేరకు జిల్లా ఇసుక కమిటీ చైర్మన్, కలెక్టర్ డాక్టర్ ఎన్,యువరాజ్ అధికారిక ప్రకటన చేశారు. ఇంతకు మించి ఎవరైనా విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇటీవల జిల్లా జేసీ నివాస్ ప్రారంభించిన మన ఇసుక యాప్‌ను రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం రీచ్‌ల నుంచి రోజుకు 3 వేల క్యూ.మీ ఇసుకతో 250 లారీల వరకు రప్పిస్తున్నారు. వీటిని యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి రవాణా చేస్తున్నారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా వినియోగంలోకి తీసుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు