మాది.. మా ఇష్టం!

10 Jan, 2015 01:46 IST|Sakshi
మాది.. మా ఇష్టం!

అనంతపురం టౌన్: అనంతపురం నగరంలో అపార్టుమెంట్ల నిర్మాణం టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసుల పంటగా మారింది. ఈ విషయంలో ఇక్కడి సిబ్బంది మొదలు అధికారుల వరకు ఎవరి దందా వారిదే. నిర్మాణాల్లో 90 శాతం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవే. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ వద్ద కచ్చితంగా ప్లాన్ అప్రూవల్ బోర్డు ఉండాలనే నిబంధన ఏ ఒక్క చోట అమలు కావడం లేదు. అయినా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు.

కారణం ఎవరి స్థాయిలో వారికి ముడుపులు ముడుతున్నందునే కళ్లకు గంతలు కట్టుకుని పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఒక ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలంటే డబ్బు చేతులు మారందే పనికాదనే ఆరోపణ సర్వసాధారణంగా మారింది. ఇదేమని అడిగితే కొర్రీలు వేస్తూ కార్యాలయం చుట్టూ నెలల తరబడి కాళ్లరిగేలా తిప్పుకుంటారు. అవినీతికి కేరాఫ్‌గా ఉంటూ తమకు అనుకూలం కావని తెలిసిన వాటి విషయంలో మాత్రం లేని నిబంధనలు పుట్టిస్తూ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తుండటం పరిపాటిగా మారింది.
 
అన్నింటిలోనూ అతిక్రమణలే
నగర పరిధిలో ఇటీవల అపార్టుమెంట్ల నిర్మాణం జోరందుకుంది. గతంలో వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో అపార్టుమెంట్లు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య ఘణనీయంగా పెరిగింది. ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లను బహుళ అంతుస్తుల్లో నిర్మిస్తున్నారు. ఏ కాలనీలో చూసినా పదుల సంఖ్యలో అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. వీటి నిర్మాణంలో బిల్డర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారు.

అపార్టుమెంట్‌కు సంబంధించిన అప్రూవల్ ప్లాన్‌ను ఒక ఫ్లెక్సీపై ముద్రించి నిర్మాణం ముందు ప్రదర్శనకు ఉంచాలి. అయితే ఈ విధానాన్ని ఎక్కడా, ఎవరూ పాటించడం లేదు. ప్లాన్ అప్రూవల్‌కు విరుద్ధంగా అదనపు ఫ్లోర్లను నిర్మిస్తున్నారు. సెట్ బ్యాక్‌లు వదలరు. గ్రీన్‌బెల్ట్‌కు స్థలం విడవరు. పెంట్ హౌస్‌లు నిర్మిస్తారు. సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించరు. పార్కింగ్ ప్లేస్ చూపించరు. సెల్లార్‌లో గదులు నిర్మిస్తున్నారు. నగరంలోని పలు అపార్టుమెంట్లలోనూ ఇదే పరిస్థితి. సెట్ బ్యాక్ అనేది లేకుండా రోడ్డుకు నిర్మిస్తున్నారు. ఇక కొందరైతే ఏకంగా రోడ్డు స్థలాన్ని కూడా అక్రమించి మెట్లు, ర్యాంప్‌లు కట్టేస్తున్నారు.

నర్సింగ్ హోమ్‌ల నిర్మాణ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ముడుపుల మాయలో పడి కళ్లు మూసుకుని పనిచేస్తుందనే విమర్శలు బహిరంగంగానే వినవస్తున్నాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చివేసే అధికారం ఉన్నప్పటికీ ఆ చర్యలకు దిగడం లేదు. సరికదా ముడుపులు ఇచ్చిన వారికి ఎలా తప్పించుకోవాలో మార్గాలు కూడా చూపిస్తున్నట్లు విమర్శలు వెల్లువెతుతున్నాయి. కోర్టుకు వెళ్లి   స్టే తెచ్చుకోండని సలహా ఇస్తున్నారట.  ఇచ్చుకోలేని వారికి అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు