మాకం రాజీనామా ఓకే

29 Dec, 2013 04:10 IST|Sakshi

సాక్షి, కడప : జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ రాజీనామాను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఆమోదించారు.  సీడబ్ల్యుసీ తెలంగాణాపై నిర్ణయం ప్రకటించడంతో అందుకు నిరసనగా  మాకం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను పీసీసీ పెండింగ్‌లో ఉంచింది. ఇటీవల బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో మూడు రోజుల  క్రితం  ఆయనను పరామర్శించేందుకు మాకం వెళ్లారు. తన రాజీనామాను ఆమోదించాలని  బొత్సను కోరారు. రాజీనామాను ఆమోదించనని, కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి కృషి చేయాలని  మాకంకు బొత్స  సూచించారు.
 
   వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యవాదాన్ని పూర్తిగా  భుజానెత్తుకున్నారని, ఇలాంటి క్రమంలో ఆయన సొంత జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షునిగా పార్టీని బలోపేతం చేయడం తన వల్ల కాదని మాకం స్పష్టంచేశారు. కాంగ్రెస్‌పార్టీ సమైక్యవాదాన్ని ప్రకటించాలని, లేకుంటే తన రాజీనామాను ఆమోదించాలని  బొత్సకు తేల్చి చెప్పారు. దీంతో  కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన శనివారం మాకం అశోక్‌కుమార్ రాజీనామాను బొత్స ఆమోదించారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యానికి కట్టుబడి రాజీనామాలు ప్రకటించారు. అయితే వీరెవరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. మాకం రాజీనామాను ఆమోదించడం చర్చనీయాంశమైంది.
 

>
మరిన్ని వార్తలు