నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటా!

4 Jul, 2020 11:50 IST|Sakshi

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు 

3 నెలలుగా బంధుమిత్రులకు దూరం 

ఏ కార్యమైనా ఇల్లు విడిచి వెళ్లాలంటే జంకు  

ఫోన్‌ సంభాషణలే పెద్ద దిక్కు  

ప్రజల్లో పెరిగిన ఆరోగ్య శ్రద్ధ 

ఒంగోలు మెట్రో: ‘‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటా.. ప్రాణం విలవిలా..’’ ఓ సినీ గేయంలో పల్లవి కావొచ్చు కానీ కరోనా మాత్రం ఇదే సందేశం ఇస్తోంది.! లాక్‌డౌన్‌ కాలంలో నువ్వు ఇంట్లోనే ఉంటే, నేను వ్యాప్తికి దూరంగా ఉంటానంటోంది.! కరోనా వైరస్‌ వ్యాప్తి సమాజాన్ని రోజురోజుకూ భయపెడుతోంది. అంతేకాదు, బంధుమిత్రులకు దూరం చేస్తోంది. కేవలం ఫోన్‌ సంభాషణలే తృప్తికి సంకేతాలుగా మలుస్తోంది. ఇంకోవైపు 
శుభకార్యాలకీ, అశుభకార్యాలకీ దూరం పెడుతోంది. సన్నిహితులు, బంధుమిత్రులు మరణించినా సరే.. వెళ్లే అవకాశం లేకుండా చేస్తోంది. చివరికి కుటుంబ సభ్యులు  మరణించినా ఫోన్‌ లైవ్‌లో అంత్యక్రియలు చూడాల్సిన దుస్ధితిని కరోనా మహమ్మారి తెచ్చిపెట్టింది.

కరోనా సామాజిక జీవితాన్ని మార్చివేసింది. వైరస్‌ వ్యాప్తికి భయపడి కష్టసుఖాలకు కూడా వెళ్లలేని పరిస్ధితిని చవిచూపిస్తోంది. గతంలో బంధువుల్లో ఎవరికైనా కష్టం వస్తే వెళ్లి పరామర్శించి రావడం ఒక అనివార్య అలవాటు. ఇప్పుడా అలవాటుని కరోనా మార్చేసింది. అదేవిధంగా ఏదైనా శుభకార్యం జరిగితే బంధుమిత్రుల సమూహమంతా పండగ సందడితో నిండి ఉండేది. కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి కలిసి మెలసి ఉంటూ ఆహ్లాదకర వాతావరణంలో కబుర్లతో ఉత్సాహంగా గడిపేవారు. ఇప్పుడవేవీ లేవు. నిజానికి విభేదాలు ఉన్నవారు సైతం దుఃఖ సమయాల్లో పరామర్శించుకుంటారు. ఇప్పుడు సొంతవాళ్లు కూడా వెళ్లకుండా కరోనా కట్టడి చేస్తోంది. చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కనుక, అతడు/ఆమె అంత్యక్రియల్లో పాల్గొని నివాళులరి్పంచి రావడం నాగరిక సమాజంలో సర్వసాధారణం. ఇప్పుడా పరిస్థితి లేదు. 

శుభకార్యాలకూ దూరం 
తరతరాల బంధుమిత్రుల సమూహం మధ్య శుభకార్యాలు నిర్వహించుకోవడం మన సంప్రదాయం. అటు ఏడు తరాలు, ఇటు ఏడుతరాలను ఆహా్వనించి శుభకార్యాలు నిర్వహించుకోవడం ఒక గౌరవంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి సందర్భమూ ఒక పండగే. పంచల పండగ నుంచి రజస్వలలు, వివాహాలు, బారసాలలు తదితర ప్రతీ సందర్భాన్నీ ఉత్సవంలా నిర్వహిస్తారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వివిధ సందర్భాలను సందడిగా నిర్వహిస్తారు. బంధుమిత్రులు ఒకచోట చేరి విందు భోజనాలు చేసి సంతోషంగా గడపుతారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం అనేది సామాజిక జీవితంలో అత్యవసరం. అటువంటిది కరోనా అన్ని పండగలను, శుభకార్యాలను దూరం చేసింది. సమూహంగా చేరడాన్ని కట్టడి చేసింది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటా అంటూ హెచ్చరిస్తోంది. మౌనం గలగలా అంటూ పరిహాసం చేస్తోంది. లేదంటే రానున్న కాలంలో అన్నింటికీ దూరం అవుతారని ప్రమాద ఘంటిక మోగిస్తోంది. ఈ హెచ్చరికలను బుద్ధిపూర్వకంగా స్వీకరించి ఆచరించడం ద్వారా మాత్రమే మంచి రోజులు వస్తాయని వాస్తవాన్ని గుర్తు చేస్తోంది.

అన్నీ ఫోన్‌లోనే.. 
ప్రస్తుతం అన్నింటికీ ఫోన్‌ మాత్రమే పెద్ద దిక్కు అయింది. అనారోగ్యంతో ఉన్నవారినైనా, చనిపోయిన వారి కుటుంబ సభ్యులనైనా ఫోన్‌లోనే పరామర్శించాల్సి వస్తోంది. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతానికి వెళ్తే కరోనా వైరస్‌ ప్రమాదం పొంచి ఉంటుందనే భయంతో పరామర్శలకు కూడా జనం వెళ్లడం లేదు. బాధా సందర్భాలైనా సరే, ఫోన్‌లోనే పరామర్శిస్తున్నారు.కరోనా వైరస్‌ వ్యాప్తి దరిమిలా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు