కాకినాడలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

10 Jan, 2015 09:17 IST|Sakshi
కాకినాడలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

*జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సోకినట్టు అనుమానం
*నివారణ  ఔషధాలు పుష్కలంగా ఉన్నాయన్న వైద్యాధికారి

 
కాకినాడ క్రైం :  సరిగ్గా రెండేళ్ల క్రితం జిల్లాను వణికించిన స్వైన్ ఫ్లూ భూతం మరోసారి జిల్లాలో కలకలం రేపుతోంది. తాళ్లరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం, పరిసరాల్లో 2012 డిసెంబర్ లో స్వైన్ ఫ్లూ వ్యాపించింది. వ్యాధిపీడితుల్లో ఒకరు తక్కిన వారు కోలుకున్నారు. ప్రస్తుతం ఓ యువతికి, మరో యువకుడికి వారం రోజుల క్రితమే స్వైన్ ఫ్లూ సోకినప్పటికీ ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాజమండ్రికి చెందిన 22 ఏళ్ల యువకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్న సమయంలో అతనికి స్వైన్ ఫ్లూ సోకి ఉంటుందని, అతని ద్వారా చిత్తూరుకు చెందిన 22 ఏళ్ల  యువతికి కూడా సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. బాధితులు మూడు రోజుల క్రితమే కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అంటువ్యాధుల వార్డులో చికిత్సనందిస్తున్నారు. వారికి గండం తప్పినట్టేనని వైద్యులు అంటున్నారు.

భీతిల్లుతున్న జ్వరపీడితులు

స్వైన్ ఫ్లూ బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండడంతో జీజీహెచ్‌లో కలకలం రేగింది. ఎక్కడిక్కడ మాస్కులు ధరించి వెళ్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న వారు భీతిల్లుతున్నారు. మత్స్యకారులు అండమాన్, నికోబార్ వంటి సుదూర ప్రాంతాలకు చేపల వేట నిమిత్తం వెళ్లి వస్తుంటారని, వారి ద్వారా కూడా వ్యాధి జిల్లాలో ప్రవేశించే అవకాశాలు లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా కాకినాడ, సామర్లకోట, రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల్లో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జ్వరపీడితులు రైళ్లలో ప్రయాణిస్తుంటే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాకినాడ నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
సొంత వైద్యం వద్దు...

జ్వరం వచ్చిన సందర్భంలో చాలా మంది మెడికల్ షాపునకు వెళ్లి తోచిన మాత్ర కొనుక్కుని వేసుకోవడం పరిపాటి. దీనిని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్వైన్ ఫ్లూ తగ్గేందుకు టామీ ఫ్లూ మందు పనిచేస్తుందని తెలిసి చాలా మంది వైద్యుడిని సంప్రదించకుండా వినియోగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడితే వ్యాధి సోకినపుడు అది పనిచేయక ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందంటున్నారు. హెచ్-1ఎన్-1 వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు.

అవగాహనతో ఆపద దూరం

 స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తికి జ్వర లక్షణాలతో పాటు వాంతులు, విరేచనాలు కావడంతో ఆయాసం ఉంటుందని స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. ఒక్కోసారి రోగి అపస్మారక స్థితికి చేరుకుంటాడని, ఆక్సిజన్ సక్రమంగా అందక శరీరం నల్లగా మారుతుందని చెప్పారు. రోగి రోగ నిరోధక శక్తి ఆధారంగా సోకిన వారం రోజుల్లో వ్యాధి బయటపడే అవకాశాలున్నాయన్నారు. మధుమేహం, గుండె వ్యాధులున్నవారికి, మద్యం సేవించే వారికి తొందరగా బయటపడుతుందన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా త్వరగా సోకుతుందన్నారు. దీని నివారణ నిమిత్తం టామీ ఫ్లూ టాబ్లెట్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ టాబ్లెట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. స్వైన్ ఫ్లూ రోగికి వైద్య సేవలందించే క్రమంలో ఎక్కువగా వైద్య సిబ్బందికి వ్యాధి సోకే ప్రమాదమున్నందున వారికి హెచ్-1 ఎన్-1 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు చెప్పారు. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. స్ట్రిప్పుల ద్వారా గొంతు, ముక్కుల నుంచి స్రావాన్ని సేకరించి, ప్రత్యేక కంటైనర్లలో భద్రపరిచి హైదరాబాద్‌లోని లేబ్‌కు పంపుతామన్నారు. స్ట్రిప్‌లు కావాల్సినన్ని అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. చాలా మంది జబ్బు ముదిరిపోయాక వైద్యులను ఆశ్రయిస్తున్నారని, అటువంటి సమయంలో తామేమీ చేయలేకపోతున్నామని చెప్పారు. ముందుగా అప్రమత్తమై అవగాహనతో వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు.      

మరిన్ని వార్తలు