మహిళామంత్రి సమక్షంలో ఆడపడుచులపై దౌర్జన్యం

4 Feb, 2019 02:34 IST|Sakshi
రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో మంత్రిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు

పసుపు–కుంకుమ కార్యక్రమం సందర్భంగా తోపుదుర్తిలో మహిళల అరెస్టు 

ఇచ్చిన హామీలు అమలు చేయాలని మహిళల డిమాండ్‌ 

డ్వాక్రా రుణ మాఫీపై మోసగించడంపై నిరసన 

రోడ్డుపై బైఠాయించిన మహిళలను ఈడ్చేసిన పోలీసులు 

మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల వర్షం కురిపించిన మహిళలు 

ఆత్మకూరు: రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో మహిళలపై దౌర్జన్యం జరిగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు మంత్రి సునీత కాన్వాయ్‌పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయకుండా మోసం చేసి, తిరిగి ఎన్నికల సమయంలో మోసపు మాటలు చెప్పడం, ప్రశ్నించిన మహిళలను పోలీసులతో అరెస్టు చేయించి విచక్షణారహితంగా వ్యవహరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తిలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి పరిటాల సునీత వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే గ్రామంలోకి మంత్రిని అడుగుపెట్టనిస్తామని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో 400 మంది పోలీసుల భద్రతతో మంత్రి వెళ్లారు. మంత్రి వస్తున్న సమయంలో వందలాది మంది మహిళలు నల్లజెండాలు చేతపట్టుకుని రోడ్డుపై బైఠాయించారు.  
మహిళలపై పోలీసుల జులుం 
మహిళలను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. రుణమాఫీ చేస్తామని చేయకుండా కేవలం రూ.10వేలు పెట్టుబడి నిధి కింద ఇచ్చారని, ఇది బ్యాంకర్లు రుణం కింద జమ చేసుకున్నారని.. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు ఇస్తాం, స్మార్ట్‌ ఫోన్‌లిస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని.. మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించడంతో కొందరికి గాయాలయ్యాయి.  రోడ్డుపై కిందపడిపోతే ఈడ్చుకుంటూ వెళ్లి వాహనంలోకి ఎక్కించారు. 

సమావేశానికి మహిళలను తెచ్చుకున్న మంత్రి 
అనంతరం తన కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలను సొంతంగా ఏర్పాటు చేసిన 60 వాహనాల్లో ఇతర గ్రామాలనుంచి రప్పించారు. మంత్రి కారుపై గ్రామస్తులు పెద్ద ఎత్తున చెప్పులు విసిరారు. అదే సమయంలో మంత్రి తనయుడు పరిటాల శ్రీరాం తన అనుచరులతో గ్రామానికి వచ్చారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారితో సమావేశం తూతూమంత్రంగా నిర్వహించి వెనుదిరిగారు. 

తాళిబొట్టు తెంపేశారు 
డ్వాక్రా రుణం మాఫీ కాలేదని మంత్రిని ప్రశ్నించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకోవడంతో దాదాపు మూడు గంటల పాటు రోడ్డు పైనే కూర్చున్నాం. మంత్రి వస్తున్నారని పోలీసులు రోడ్డుపై ఉన్న మమ్మల్ని ఈడ్చిపడేశారు. ఆ సమయంలో నా తాళిబొట్టు తెగిపోయింది. ఇంత అరాచకం చేస్తారా? ఒక మహిళగా మంత్రి సునీత వ్యవహరించిన తీరు ఏం బాగోలేదు. మా ఉసురు తప్పక తగులుతుంది.     – మమత, తోపుదుర్తి 

మరిన్ని వార్తలు