ఉద్యోగ భద్రత.. సర్కారు బాధ్యత

4 Jul, 2020 12:54 IST|Sakshi
ఉద్యోగులకు నియమాక పత్రాలు అందిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్‌ వినయ్‌చంద్, చిత్రంలో విప్‌ ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌  

ఏపీసీవోఎస్‌ పరిధిలోకి 3617 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

రిజర్వేషన్ల ప్రకారం ఇక  పారదర్శకంగా నియామకాలు 

ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు 

మహారాణిపేట(విశాఖ దక్షిణ):  అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు దశాబ్దాలుగా ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నారని, వారి భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేషన్‌ ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆయన మాట్లాడారు. అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు దళారీ వ్యవస్ధ కారణంగా ఎంతో మంది మోసపోయారని, అటువంటి అన్యాయాలు, అక్రమాలు భవిష్యత్తులో జరగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 వేల మందికి పైగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని, జిల్లా వ్యాప్తంగా 3617 మందికి మేలు కలుగుతుందని చెప్పారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. రిజర్వేషన్లు, మెరిట్, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా అన్ని బెనిఫిట్స్‌తో అవకాశం కల్పిస్తామన్నారు.

కార్పొరేషన్‌ ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా యువత హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. ఉద్యోగులు మరింత నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీ న జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్పందన కార్యక్రమానికి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే స్కిల్డ్, సెమి స్కిల్డ్, ఆన్‌స్కిల్డ్‌ అభ్యర్థులను ఎప్పటికప్పుడు కార్పొరేషన్‌కు రిఫర్‌ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సదుపాయాలు సక్రమంగా అమలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తిరాజు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్‌గణేష్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు.

ఇక కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ 
అవుట్‌ సోర్సింగ్‌ సరీ్వసెస్‌ కార్పొ రేషన్‌ ద్వారా ఇక నుంచి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ప్రభుత్వ శాఖ లకు అవసరమైన ఖాళీలను రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తాం. ఏపీసీవోఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పోస్టుల భర్తీ కమిటీకి కలెక్టర్‌ ఎక్స్‌ అఫీషియో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గాను, మెంబర్‌ కనీ్వనర్‌గా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఉంటారు. 
– సిహెచ్‌.సుబ్బిరెడ్డి, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి 

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.. 
నాలుగేళ్లుగా లీగల్‌ మెట్రాలజీ శాఖలో పని చేస్తున్నా. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క సారి జీతాలు సక్రమంగా అందేవి కావు. గట్టిగా అడిగితే ఉద్యోగం పోతుందేమోనని భయం ఉండేది. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటైంది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం వస్తుందన్న నమ్మకం కలిగింది. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.
– ఎస్‌.శివశంకర్, డ్రైవర్‌

జీతాలు పెరుగుతాయి.. 
జీతాలు పెంచాలని ఎన్నో సార్లు గతంలో వినతి పత్రాలు అందించాం. నాకు నెలకు రూ.13,500 జీతం వస్తోంది. నా కుటుంబ పోషణకు సరిపోడం లేదు. పని ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు కార్పొరేషన్‌ ద్వారా జీతాలు చెల్లింపులు చేయడం చాలా మంచిది. దీని వల్ల జీతాలు పెరుగుతాయన్న నమ్మకం కలుగుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ను అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. 
– బి.శ్రీనివాసరావు, రుషికొండ టూరిజం ఉద్యోగి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా