అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ‘ఎసరు’

23 Jun, 2014 03:03 IST|Sakshi

- జిల్లాలో 6వేల మంది ఉద్యోగుల తొలగింపునకు యత్నం
- నెలాఖరుతో ముగియనున్న అవుట్ సోర్సింగ్ గడువు

ఏలూరు : జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మీద సుమారు 6వేల కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏ శాఖలోనైనా వీరు లేనిదే పని నడవని పరిస్థితి. నెలనెలా సకాలంలో జీతం అందకపోయినా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నారు.

జీతం ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోరాటాలు చేస్తే  నాలుగైదు నెలల జీతం ఒకేసారి ఇస్తున్నారు. తమ ఉద్యోగాలకు మంగళం పాడితే కుటుంబంతో సహా రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు  కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. వీరి సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో తమను తొలగించడం ఖాయమన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. .దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ దశల్లో ఆందోళనలకు రూపకల్పన చేస్తున్నారు.
 
అవుట్‌సోర్సింగ్ సేవలందిస్తున్న ఉద్యోగులు ఇలా
గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సుమారు 100 పనిచేస్తున్నారు. రెవెన్యూశాఖలో కలెక్టరేట్ నుంచి ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో 43మంది కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్‌లో ఆరుగురు,  జిల్లా నీటి యాజమాన్య సంస్థలో 80మంది ,ఉపాధి హామీ పథకంలో 300 మంది, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 108, 104, జాతీయ ఆరోగ్యమిషన్ లలో 150 మంది ల్యాబ్ టె క్నీషియన్లు, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు.

మహిళ శిశు అభివృద్ధి సంస్థలో 40 మంది ,విద్యాశాఖలో కంప్యూటర్ టీ చర్లు, టీఆర్‌సీలు, డ్రాయింగ్ టీచర్లుగా 2000 మంది, జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కలిపి సుమారు 1000 మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డేటా ఎంట్రీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర ఆపరేటర్లు 400 మంది, గ్రామాల్లో, పీహెచ్‌సీల్లో సెకండ్ ఏఎన్‌ఎంలు 600 మంది, ఇరిగేషన్  శాఖ ,పోలవరం ప్రాజె క్టు పరిధిలో హెల్పర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, 200 మంది, పశుసంవర్థకశాఖలో గోపాలమిత్ర, ఇతర సేవల కింద 100 మంది, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల్లో 200 మంది క్షేత్ర స్థాయిలోను సేవలందిస్తున్నారు.

ఉద్యాన శాఖలో క్షేత్ర స్థాయిలో 100 మంది, ఇందిర క్రాంతి పథం కింద ధాన్యం కోనుగోలు, భూములు గుర్తింపు పనుల కింద 200 మంది అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరందరికి మంగళం పాడితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీకాక ఇప్పుడున్న సిబ్బందే నానాపాట్లు పడుతున్నారు. ఇక వీరి కష్టాలు మరింత పెరిగిపోతాయి. ఖాళీలు భర్తీ చేయకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే ప్రభుత్వ కార్యక్రమాల నివేదికలను అందించటం కష్టం అవుతుందని అన్ని శాఖల్లోను గుబులు రేగుతోంది.
 
క్రమబద్ధీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం ఎత్తుగడ!
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలకు పూర్తిస్ధాయిలో మంగ ళం పాడకపోతే వారు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఆందోళన మొదలెడతారని టీడీపీ సర్కార్ ఈ ఎత్తుగడకు దిగిందన్న విమర్శలు వస్తున్నాయి. దశలవారీగా వీరిసేవలకు ఫుల్‌స్టాప్ పెట్టి, కొత్త వారిని తీసుకుంటారని భావిస్తున్నారు. ఉద్వాసనకు గురయ్యే వారిలో అతి తక్కువ మందికి మాత్రమే తిరిగి ఉద్యోగాలు లభిస్తాయని ప్రస్తుత అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది

మరిన్ని వార్తలు