రె‘బెల్స్’కుబుజ్జగింపులు

16 Mar, 2014 02:34 IST|Sakshi
రె‘బెల్స్’కుబుజ్జగింపులు
  • పోటీనుంచి తప్పించేందుకు యత్నాలు
  •  18 వరకు ఉపసంహరణకు గడువు
  •  అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠే
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శనివారం జరిగింది. 1,731 నామినేషన్లు దాఖలు కాగా 106 తిరస్కరణకు గురయ్యాయి. ఇంటి పేర్లు తప్పు రాయటం, ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్లు తప్పు వేయటం, అభ్యర్థిని బలపరిచినవారి ఓట్లు సంబంధిత వార్డులో లేకపోవటం తదితర కారణాలతో అధికారులు వాటిని తిరస్కరించారు. ఉదయం 11 గంటలకు పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. మునిసిపల్ కమిషనర్లతో పాటు సహాయ ఎన్నికల అధికారులు, పురపాలక సంఘాల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు వార్డుల వారీగా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. తిరస్కరించిన నామినేషన్లలో రెండు, మూడు సెట్లు దాఖలు చేసిన అభ్యర్థులవే అధికంగా ఉన్నాయి.
     
    బుజ్జగింపులు.. బేరసారాలు
     
    నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం బరిలో అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండటంతో రెబల్స్ బెడద తప్పించుకునేందుకు ఎవరికివారు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. రెబల్ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు శనివారం రాత్రి నుంచే ఆయా పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. ఒకే పార్టీ నుంచి ఒకరికి మించి అభ్యర్థులు ఉంటే ఈ ప్రభావం పార్టీ గెలుపుపై పడుతుందని రెబల్ అభ్యర్థులకు సర్దిచెప్పేందుకు వేగులను పంపుతున్నారు.

    నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు మాత్రం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందని, పోటీలో ఉంటే తామే గెలుస్తామని, అయినా తమ సంగతేంటని బేరసారాలు నడుపుతున్నారు. ఈ నెల 18న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావటంతో ఈలోపే రెబల్ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు.
     
    ప్రచారంలో అభ్యర్థులు...

     నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావటంతో అభ్యర్థులు ప్రచారానికి తెరతీశారు. ఇంటింటికి వెళ్లి తమనే కౌన్సిలర్‌గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
     
    బందరులో నామినేషన్ తిరస్కరణపై వాగ్వాదం
     
    మచిలీపట్నం పురపాలక సంఘంలో 37వ వార్డు టీడీపీ అభ్యర్థిగా అచ్చయ్యనాయుడు దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. తండ్రి పేరును నామినేషన్ పత్రంలో సత్యనారాయణకు బదులుగా సూర్యనారాయణ అని రాయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, కొల్లు రవీంద్ర మునిసిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు.

    ఈ నేపథ్యంలో 37వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లంకా సూరిబాబు, ఆ పార్టీ నాయకులు బొర్రా విఠల్, మోకా భాస్కరరావు, షేక్ సలార్‌దాదా వారిని అడ్డుకున్నారు. ఈ అంశంపై కమిషనర్ చాంబర్‌లో వాదోపవాదాలు జరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కార్యాలయంలోనే వైద్యులు చికిత్స చేశారు. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలిస్తామన్నారు. చివరికి టీడీపీ నేతలు నామినేషన్‌ను పునఃపరిశీలించాలని కమిషనర్ మారుతిదివాకర్‌కు వినతిపత్రం అందజేశారు.
     

>
మరిన్ని వార్తలు