కూలిన ఓవర్ హెడ్ ట్యాంక్.. తప్పిన పెను ముప్పు

24 Oct, 2013 05:10 IST|Sakshi

తూప్రాన్, న్యూస్‌లైన్: పట్టణం నడిబొడ్డున ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు బుధవారం రాత్రి అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే సమీపంలో జనమెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 1986లో నిర్మించిన ఈ ట్యాంకు 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగి పట్టణ వాసుల దాహార్తిని తీర్చింది. అయితే కొన్నాళ్లుగా శిథిలావస్థకు చేరిన ఈ ట్యాంకు బుధవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఘటన ఉదయం పూట జరిగి ఉంటే నిత్యం రద్దీగా ఉండే  ఈ ప్రాంతంలో ప్రాణనష్టం భారీగానే ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్యాంకు కూల్చి దాని స్థానంలో కొత్త ట్యాంకు నిర్మించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని వారు అంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ శివ్వమ్మ, వార్డు సభ్యులు ఆంజాగౌడ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
 
 శిథిలావస్థలో మరో ట్యాంకు
 ప్రస్తుతం కూలిపోయిన ట్యాంకు సమీపంలోనే మరో 40 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంది. ప్రస్తుతం అది కూడా శిథిలావస్థకు చేరిం ది.ఎప్పుడు కూలుతుందో తెలియక ప్రజలు భయాందోళన మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ట్యాంకు కూలితే పక్కనే నివాసం ఉండే వారికి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.
 
 శంకుస్థాపనకే పరిమితం
 ఇపుడు కూలిపోయిన ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకు నిర్మాణం కోసం ఆగస్టు 13న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి, , గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు రూ.29 లక్షల వ్యయంతో లక్ష ఇరవై వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. నిత్యం పట్టణ ప్రజలకు తాగునీరందించే ట్యాంకు కూలిపోవడం...ప్రత్యామ్నాయంగా ఆమేరకు సామర్థ్యం కలిగిన ట్యాంకు ఇపుడపుడే నిర్మించే వీలు లేకపోవడంతో పట్టణవ ాసులకు నీటికష్టాలు తప్పేట్లు లేవు.

మరిన్ని వార్తలు