అతి వేగమే కొంప ముంచుతోంది!

18 Nov, 2019 13:48 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం (ఫైల్‌)

సాక్షి, అమరావతి: మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధప్రదేశ్‌లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 82 శాతం మంది ఈ రెండు కారణాలతో దుర్మరణం చెందారు. ఒక్క మితిమీరిన వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో 72 శాతం మంది మృతి చెందినట్టు కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అధిక వేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. తమిళనాడు 2, కర్ణాటక 3, తెలంగాణ 7, కేరళ 13 స్థానాల్లో ఉన్నాయి.

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రమాదాల్లో 80 శాతంపైగా సవ్యంగా, నేరుగా ఉన్న రోడ్లపైనే జరిగాయి. అదికూడా పగటి సమయంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు జరిగినవే కావడం గమనార్హం. దీనిబట్టి రాష్‌ డ్రైవింగ్‌ ఎంతలా ప్రమాదాలకు కారణం అవుతుందో అర్థమవుతోంది.

రోజుకు 9 మంది మృతి
రోడ్డు ప్రమాదాలకు మరో కారణం తాగి నడపడం. డ్రంకన్‌ డ్రైవింగ్‌ కారణంగా గతేడాది ఏపీలో 1,345 ప్రమాదాలు జరిగి 85 మంది మృతి చెందారు. ఇక​ రక్షణ పరికరాలైన హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వినియోగించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో 43 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించకపోవడంతో 1707 మంది బైకర్లు, 678 మంది రైడర్లు మృతి చెందారు. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో 395 మంది డ్రైవర్లు, 451 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. రక్షణ పరికరాలు వాడకపోవడం​ వల్ల రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 9 మంది చనిపోతున్నారు.

పల్లె దారుల్లోనూ మృత్యుఘంటికలు
గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. రూరల్‌లో 70 శాతం ప్రమాదాలు చోటు చేసుకోగా 76 శాతం మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో ఏపీ 7వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంత రోడ్డు ప్రమాదాల్లో 9వ స్థానంలో ఉన్నట్టు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. పరిమిత వేగం, ట్రాఫిక్‌ నియమాలు పాటించడం​, హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించడం ఎంతో ముఖ్యమో ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. (చదవండి: ప్రేమ హత్యలే అధికం!)

మరిన్ని వార్తలు