విదేశీ ఉద్యోగాల కోసం మోసపోవద్దు : డీఐజీ

27 Mar, 2015 03:50 IST|Sakshi

ఘంటసాల : విదేశీ ఉద్యోగాల కోసం గుర్తింపులేని ఏజెంట్లను సంప్రదించి మోసపోవద్దని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగాల కోసం మోసపోతున్న వారి కేసులు పెరుగుతున్నాయన్నారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఆరు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకునే గుర్తింపు ఉన్న ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని, ఈ విషయంలో అనుమానం వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

గుర్తింపు లేని, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, వ్యక్తుల వద్ద సొమ్ములు డిపాజిట్ చేయొద్దని సూచించారు.  జిల్లాలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల నేరాల సంఖ్య తగ్గినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించుకోగలుగుతామన్నారు. అనంతరం ఆయన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ కేఎస్ ఖాదర్‌బాషా, చల్లపల్లి సీఐ వైవీ రమణ, స్థానిక ఎస్‌ఐ టీవీవీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు