ఇండియన్ కోస్టుగార్డుకు సొంత నౌక..

23 Apr, 2015 19:19 IST|Sakshi

ముత్తుకూరు (నెల్లూరు) : కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డుకు సకల హంగులతో కూడిన కొత్త నౌక సమకూరింది. సూరత్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ నౌక కృష్ణపట్నం పోర్టులో 1వ నెంబరు బెర్త్ వద్ద లంగరు వేసింది. 26 మీటర్ల పొడవున్న ఈ నౌకను 'ఇంటర్ సెప్టర్ బోట్' అంటారు. దీని పేరు 'చార్లీ 417'. త్వరలో ఈ నౌకను అధికారికంగా లాంచ్ చేసేందుకు కోస్టుగార్డు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.

అసోంకు చెందిన కమయ్ అనే అధికారి ఈ నౌకకు అసిస్టెంట్ కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు మొత్తం 13 మంది గార్డులు ఇందులో ఉంటారు. ఈ నౌక గంటకు 40 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. శాశ్వతంగా ఇక్కడ ఉండే ఈ నౌక కోసం పోర్టులో ప్రత్యేక బెర్త్ కేటాయించేందుకు కోస్టుగార్డు అధికారులు పోర్టు నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలియవచ్చింది. దీనికి 50 మీటర్ల బెర్తు అవసరం. బెర్తు ఏర్పడిన తర్వాత వారంలో మూడు రోజుల పాటు ఈ నౌక సముద్రంలో గస్తీ తిరిగేందుకు ఉపయోగిస్తారు. ఈ నౌక పనితీరు, ప్రత్యేకతలను అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు