రుయాలో పగిలిన ఆక్సిజన్‌ పైప్‌లైన్‌

27 Mar, 2018 07:18 IST|Sakshi
సిలిండర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, కమిషనర్‌

త్రుటిలో తప్పిన ముప్పు 

పరిశీలించిన కలెక్టర్, కమిషనర్‌

తిరుపతి (అలిపిరి): రుయాలో ఫుట్‌పాత్‌ ఏర్పాటు కోసం చేపడుతున్న పనుల్లో భాగంగా జేసీబీ రోడ్డు తవ్వుతుండగా ఆక్సిజన్‌ సరఫరా అయ్యే పైప్‌లైన్‌ తెగిపోయింది. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వెంటిలేటర్‌పై వైద్యం పొందుతున్న రోగుల బంధువులు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న తిరుపతి ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ కనక నరసారెడ్డి, అర్బన్‌ తహసీల్దార్‌ చంద్రమోహన్‌ హుటాహుటిన అక్కడకు చేరుకుని పైప్‌లైన్‌ మరమ్మతులను పరిశీలించి ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం కలెక్టర్‌ ప్రద్యుమ్మ దృష్టికి పోవడంతో రాత్రి 10 గంటలకు కలెక్టర్‌ రుయాకు చేరుకుని కట్‌ అయిన పైపులైన్‌ను పరిశీలించారు.

అనంతరం ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆస్పత్రి రూట్‌మ్యాప్‌ను దగ్గరుంచి పనులు చేపట్టాలని రుయా ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌ కట్‌ అయ్యే సమయంలో 12 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా  తగు చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. అనంతరం ఆక్సిజన్‌ సిలిండర్‌ను కమిషనర్‌ హరికిరణ్, తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌తో కలసి పరిశీలించారు. రుయా వార్డులను పరిశీలించి ఆక్సిజన్‌ సిలిండర్లపై ఆరా తీశారు. రుయా సూపరిం టెండెంట్‌  డాక్టర్‌ సిద్దానాయక్, ఆర్‌ఎంవో శ్రీహరి పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు