గుట్కాసురులు

20 Mar, 2016 03:35 IST|Sakshi
గుట్కాసురులు

గుప్పుమంటున్ననిషేధిత గుట్కా
కొత్తచెరువు కేంద్రంగావిస్తరిస్తున్న వ్యాపారం
కర్ణాటక నుంచి పెద్ద ఎత్తునదిగుమతి
కొరవడిన అధికారుల నిఘా
ఇదే అదనుగా రెచ్చిపోతున్న మాఫియా

 
మొన్న హిందూపురం.. నిన్న గుంతకల్లు.. నేడు కొత్తచెరువు... రేపు ఎక్కడో..? నిషేధం ముసుగులో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది.  సరిహద్దులు దాటి అన్ని ప్రాంతాలకు చేరవేస్తోంది. అడ్డొచ్చే అధికారుల నోళ్లను నోట్ల కట్టలతో మూయిస్తోంది. ఇదే అదనుగా కోట్లకు పడగలెత్తుతోంది. ప్రజల ప్రాణాలతో    చెలగాటమాడుతోంది. జిల్లా వ్యాప్తంగా పట్టుబడుతున్న గుట్కా నిల్వలే అందుకు నిదర్శనం. - కొత్తచెరువు
 
కొత్తచెరువు కేంద్రంగా గుట్కా మాఫియా విస్తరిస్తోంది. కొందరు వ్యాపారులు సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో గుట్కా వ్యాపారాన్ని ఎంచుకున్నారు. అందులో గుట్కా కింగ్ అవతారమెత్తి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. కొత్తచెరువు, తలమర్లకు చెందిన పలువురు వ్యాపారులు పొరుగున ఉన్న కర్ణాటకలోని బాగేపల్లి నుంచి నిత్యం గుట్కా ప్యాకెట్ల నిల్వలను దిగుమతి చేసుకుంటున్నారు. కొత్తచెరువుకు చెందిన ఓ వ్యాపారి సమీప బంధువు బాగేపల్లిలో గుట్కా డీలర్ కావడంతో వారానికి మూడుసార్లు చొప్పున కొత్తచెరువుకు సరుకును దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ఐదేళ్ల కిందటి వరకు అతనొక సాధారణ వ్యాపారి. నాలుగేళ్లలోనే కోట్లకు పడగలెత్తడం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగక విలువైన స్థలాలు కొనుగోలు చేయడాన్ని చూస్తే అతని వ్యాపారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతోంది.

విజిలెన్స్ అధికారుల దాడితో...
కొత్తచెరువులోని ఓ ఇంటిపై విజిలెన్స్ అధికారుల బృందం శుక్రవారం దాడులు నిర్వహించి రూ.1.63 లక్షల విలువ చేసే తొమ్మిది రకాల గుట్కా ప్యాకెట్లతో పాటు రూ.1.50 లక్షల విలువ చేసే సిగరెట్లు, బీడి బండిళ్లు స్వాధీనం చేసుకోవ డం తెలిసిందే. ఈ ఘటనతో కొత్తచెరువులో గుట్కా వ్యా పారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పట్టుబడిన వ్యాపారి ఇంటిపై గతంలోనూ ఒకసారి అధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పట్లో అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై అప్పట్లో చర్చ సాగింది.

 దాడులు మొక్కుబడే...
నిషేధిక గుట్కా నిరంతరం దిగుమతి అవుతున్నా పోలీసులు అప్పుడప్పుడు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్నారు. అయితే దిగుమతిపై దృష్టి సారించడం లేదు. ఎక్కడెక్కడ, ఎవరెవరు గుట్కా వ్యాపారం సాగిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియనిది కాదు.  ఇందుకు నిదర్శనం హిందూపురంలోను వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా ఆధ్వర్యంలో రూ.10 లక్షల విలువ చేసే మట్కా ప్యాకెట్లను పట్టుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. గుంతకల్లులోనూ అధికారులు గతంలో దాడులు నిర్వహించి భారీ ఎత్తున గుట్కా నిల్వలు పట్టుకున్న ఉదంతం అందరికీ గుర్తే.

మరిన్ని వార్తలు