‘పాదయాత్ర’ లొల్లి!

14 Feb, 2014 23:25 IST|Sakshi

యాచారం, న్యూస్‌లైన్:  కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోమారు బయటపడ్డాయి. శుక్రవారం యాచారం మండలం గునుగల్‌లో చేపట్టిన యువజన కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వస్తున్నట్లు యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సిద్దంకి కృష్ణారెడ్డి గురువారమే పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు.

 అయితే శుక్రవారం ఉదయం కృష్ణారెడ్డి తదితరులు గునుకుల్‌కు రాకముందే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంకాల దాసు, హయత్‌నగర్ మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డిలు పాదయాత్రను ప్రారంభించేశారు. పాదయాత్ర గునుగల్ గేట్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకోగానే క్యామ మల్లేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దంకి రజితారెడ్డి తదితరులు వారికి ఎదురుపడ్డారు. ఈ క్రమంలో యువజన కాంగ్రెస్‌లో క్యామ మల్లేష్ వర్గానికి చెందిన కొందరు మరోమారు పాదయాత్రను ప్రారంభించాలని కోరడంతో మళ్లీ ప్రారంభించారు.

దీంతో రెండు వర్గాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు అర కిలోమీటర్ తేడాతో పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు ఏ గ్రూపులో ఉండి నడవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. మల్‌రెడ్డి రాంరెడ్డి ప్రారంభించిన పాదయాత్రలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వెంకట్‌రెడ్డి, మంకాల దాసు, గునుగల్ సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్ తదితరులు పాల్గొనగా, క్యామ మల్లేష్ ప్రారంభించిన పాదయాత్రలో డీసీసీ ప్రధాన కార్యదర్శి దెంది రాంరెడ్డి, గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్, గునుగల్, యాచారం, నక్కర్తమేడిపల్లి, చౌదర్‌పల్లి తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

 ఇబ్రహీంపట్నం టికెట్  ఆశిస్తున్నా: రజితారెడ్డి
 మహిళల కోటాలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దంకి రజితారెడ్డి వెల్లడించారు. రాహుల్ గాంధీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి సూచనల మేరకే పాదయాత్ర చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో సిద్దంకి కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనువాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, యాలల యాదయ్య, కుంటి నర్సింహ, కన్నరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు