ప్రాణాధారం కోసం పోరుబాట

15 Aug, 2018 13:04 IST|Sakshi

టీడీపీ సర్కారుపై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం

వెలిగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని డిమాండ్‌

నేడు కనిగిరి నుంచి మాజీ ఎంపీ వైవీ పాదయాత్ర ప్రారంభం

తరలి వస్తున్న ముఖ్యనేతలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

యాత్ర విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాలినేని పిలుపు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ సర్కారుపై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం పూరిస్తోంది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోరుబాట పడుతోంది. ప్రాజెక్టు నిర్మాణం తక్షణం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో  ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధమైంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు పాదయాత్ర కనిగిరి నుంచి ప్రారంభం కానుంది. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కనిగిరి పామూరు బస్టాండు సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆతర్వాత యాత్ర కనిగిరిలో ప్రారంభమై మధ్యాహ్న విరామానికి మార్కెట్‌ యార్డు సమీపానికి చేరుకుంటుంది. భోజన విరామ అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమై 6 కిలోమీటర్లు సాగి తొలిరోజు సాయంత్రానికి హాజీపురం క్రాస్‌ వద్దకు చేరుకుంటుంది.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి నేతల రాక..
పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి జిల్లాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, ఆదిమూలం సురేష్‌తో పాటు పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. వీరితోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనీల్‌కుమార్‌ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పట్ల చంద్రబాబు సర్కారు వైఫల్యంతో పాటు ప్రాజెక్టు సత్వర పూర్తి అవసరాన్ని యాత్ర సందర్భంగా నేతలు ప్రజలకు తెలియచెప్పనున్నారు.

నాలుగేళ్లు నాన్చి ఇప్పడు హడావుడి..
శ్రీశైలం జలాశయం నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు 43.58 టీఎంసీలకృష్ణా వరద నీటిని మళ్లించాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల పరి«ధిలోని 23 మండలాలలో 3,36,100 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందాల్సి ఉంది. దీంతో పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గంలో 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో 84వేల ఎకరాలకు సైతం సాగు నీరు అందాల్సి ఉంది. పై మూడు జిల్లాలో పరిధిలో 15.25 లక్షల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా సురక్షిత తాగునీరు అందించాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలింది. పేరుకు 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా ఆ ఏడాది కేవలం రూ.9.66 లక్షలు మాత్రమే కేటాయించి బాబు చేతులు దులుపుకున్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లకు పైగా కేటాయించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాదే పనులు పూర్తి చేసి వెలిగొండ ద్వారా నీరిస్తానంటూ హమీ ఇచ్చినా నాలుగేళ్ల పాలనలో అది నెరవేరలేదు. కాంట్రాక్టర్ల వివాదంతో మూడు నెలలుగా వెలిగొండ పనులు పూర్తిగా నిలిచి పోయాయి.

ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు..
వెలిగొండ పూర్తి కోసం ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్రకు సిద్ధం కావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు పనులు మొదలు పెడతామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసినా అది ఆచరణకు నోచుకోలేదు. ఏడాది పాటు ఎడతెగకుండా పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించినా టన్నెల్‌–1 పనులు పూర్తయి ఫేజ్‌–1 ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వెలిగొండ ద్వారా నీరిస్తామంటూ చంద్రబాబు మరోమారు పశ్చిమ ప్రాంత వాసులను వంచించే ప్రయత్నానికి దిగారు.

పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టే ప్రాణాధారం. సాగు, తాగునీరు ఆ ప్రాజెక్టు వల్లే సాధ్యం. కనిగిరి, కొండేపి, కందుకూరు, మార్కాపురం ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ నీరే ప్రజలకు దిక్కు. ఫ్లోరైడ్‌ నుంచి బయట పడేందుకు ప్రజలు వాడుతున్న మందులవల్లే కిడ్నీలు పాడై జనం పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండను పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని జిల్లా వాసులకు ముఖ్యంగా పశ్చిమ ప్రాంత వాసులకు తెలియచెప్పడంతో పాటు తక్షణం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే వైఎస్సార్‌ సీపీ ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధమైంది. 207 కిలోమీటర్లు 15 రోజులకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ వద్ద యాత్ర ముగియనుంది. వరుస కరువులతో అల్లాడిపోతున్న జిల్లా వాసుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మరింత ఒత్తిడి పెంచేందుకు చేపట్టిన పాదయాత్రకు అందరూ మద్దతు పలికి విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు