మన్యాన్ని వీడని మహమ్మారి

3 May, 2016 04:19 IST|Sakshi
మన్యాన్ని వీడని మహమ్మారి

2009లో వెలుగు చూసిన ఆంత్రాక్స్
మరో రెండు గ్రామాల్లో వ్యాధి లక్షణాలు
పాడేరు ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు
ప్రాథమిక సేవల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలింపు
పశుమాంసం తినడం వల్లే అంటున్న వైద్య సిబ్బంది

 
పాడేరు: ప్రాణాంతక ఆంత్రాక్స్ మహమ్మారి మన్యాన్ని వీడటం లేదు. 2009 నుంచి ఏదో ఒక ప్రాంతంలో ఈ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ముంచంగిపుట్టు మండలం కర్లపొదోర్, అత్తికల్లు, ఆడారిలడి, ముక్కిపుట్టు, బరడ గ్రామాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపింది. అప్పట్లో 20 మందికి పైగా దీని బారిన పడ్డారు. కాళ్లు,చేతులపై పెద్ద పెద్ద గాయాలు ఏర్పడి శరీరమంతా కబళించడంతో సుమారు పది మంది చనిపోయారు.  అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ భీముడువలస వాసులనూ ఇది పీడించింది. ఇక్కడ ఎవరూ చనిపోనప్పటికీ కొన్ని పశువులను కబళించింది.

నాటి నుంచి అక్కడక్కడా ఈ వ్యాధి లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. ఇటీవల హుకుంపేట మండలం పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోక ముందే జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ వెన్నెలకోటలో ఆరుగురు, గొయ్యిగుంటలో 13 మంది దీని బారిన పడ్డారు. వెన్నెలకోటకు చెందిన కొర్రా సుందరరావు, కొర్రా కృష్ణారావు, కొర్రా సీందు, గెమ్మెలి గంగన్నదొర, కిల్లో దన్ను, గెమ్మెలి భాస్కరరావు, గొయ్యిగుంటకు చెందిన కిల్లో పుల్లయ్య, మర్రినాగేశ్వరరావు, కొర్రా సుబ్బరావు, కిల్లో సుబ్బారావు, కిల్లో సుందరరావు, కిల్లో చిట్టిబాబు, పాంగి చంటి, పాంగి సుబ్బారావు, మర్రి పల్సో, కిల్లో చిట్టిబాబు, కొర్రా కామేశ్వరరావులతో పాటు మహిళలు కిల్లో సావిత్రి, మర్రి కుదే ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో గెమ్మెలి గంగదొర కుడి కాలు అడుగుభాగం పూర్తిగా కుళ్లిపోయింది.

ఇతని పరిస్థితి విషమంగా ఉంది. చర్మవ్యాధిగా కనిపించే ఈ మహమ్మారి కొద్ది రోజుల్లోనే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుండటంతో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం గ్వాలియర్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తల బృందం రక్త నమూనాలు సేకరించి అధ్యయనం చేపట్టింది. గతంలో కూడా వైద్యనిపుణులు ముంచంగిపుట్టు ప్రాంతంలో ఆంత్రాక్స్‌పై పరిశోధనలు జరిపారు. కట్టుదిట్టమైన చర్యలతో ఆ ప్రాంతంలో ఈ వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది.


 పశుమాంసం తినడం వల్లే ..
నిల్వ ఉన్న పశుమాంసం తినడం వల్లే ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్టు వైద్యబృందాల పరిశీలనలో వెల్లడవుతోంది. ఆంత్రాక్స్ వెలుగు చూసిన ప్రతి గ్రామంలోనూ దీనిపై అధ్యయనం చేసినప్పుడు ఇదే విషయం నిర్ధారణ అయింది. ఏజెన్సీలోని కొన్ని తెగల పీవీటీజీలకు పూర్వం నుంచి పశుమాంసం తినడం అలవాటు. వారపుసంతల్లోనూ దీనిని చాటుమాటుగా విక్రయిస్తుంటారు. చనిపోయినవాటిని తినడం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందన్న వాదన ఉంది. నిల్వ ఉంచిన, చనిపోయిన పశువుల మాంసం తిని వివిధ గ్రామాల వారు డయేరియా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడిన వెన్నెలకోట, గొయ్యిగుంట గ్రామాల్లో రెండు వారాల్లో వ్యాధులతో 30 పశువులు, 20మేకలు చనిపోయాయి.

వాటి మాంసం ఆదివాసీలు తిన్నారు. నాటి నుంచే చర్మంపై కురుపులు, పొక్కులు వచ్చాయని ఆయా గ్రామస్తులు అంగీకరిస్తున్నారు. ఏళ్లమామిడి గ్రామం నుంచి వెన్నెలకోట చుట్టంచూపుగా వచ్చిన పాంగి అప్పారావు కూడా ఈ మాంసం తిని చర్మవ్యాధులకు గురయ్యాడు.

క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానం
వైద్యనిపుణుల బృందం క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానిస్తోంది. వారం రోజులుగా పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. రక్తనమూనాలను ప్రయోగశాలకు తరలించారు. జి.మాడుగుల మండలం వెన్నెలకోట, గొయ్యిగుంటల్లో ఆంత్రాక్స్ లక్షణాలతో మరో 19 మంది బాధపడుతున్నట్టు వెలుగులోకి రావడంతో అధ్యయనానికి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల బృందం మంగళవారం ఈ గ్రామాల్లో పర్యటించనుంది. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా నిర్ధారణ అయితే 10 కిలోమీటర్ల పరిధిలో పశువులకు వ్యాక్సినేషన్ చేపడతామని పశుసంవ ర్థకశాఖ ఏడీ ఎం.కిశోర్ తెలిపారు.

మరిన్ని వార్తలు