పద్మ‘సిరి’ వెన్నెల

26 Jan, 2019 10:25 IST|Sakshi

భావ రచయితకు అరుదైన గౌరవం

అనకాపల్లితో విడదీయరాని బంధం

విశాఖపట్నం  : భారత ప్రభుత్వ ఉన్నత పురస్కారం పద్మశ్రీ సిరివెన్నెలను ముద్దాడింది. ప్రజాస్వామ్య విలువలను, సమాజ శ్రేయస్సును ముందుండి నడిపిన ఆ పద సంపదకు సముచితస్థానం లభించింది. సందేశాత్మక సిన గేయ రచయితగా సుప్రసిద్ధులైన సిరివెన్నెల సీతారామశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం సినీ గేయరచయిత సిరివెన్నెలకు పద్మశ్రీ అవార్డును శుక్రవారం ప్రకటించింది. మూడు దశాబ్దాలుగా సినీ వీధిలో తనదైన ముద్రవేయడంతో పాటు సమాజాన్ని మెల్కోలిపే అనేక సందేశాత్మక గీతాలకు ఆయన ప్రాణం పోశారు. విశాఖ జిల్లాకు చెందిన ఆయనకు పద్మశ్రీ లభించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అనకాపల్లితో విడదీయరాని అనుబంధం
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చేబోలు సీతారామశాస్త్రి. ఆయన తండ్రి సీవీ యోగి వేదపండితుడు. తల్లి అమ్మాజి గృహిణి. అనకాపల్లిలోని గాంధీనగర్‌లో వారి నివాసం. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. అనకాపల్లిలోని మునిసిపల్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆయన ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చేరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి బీఎస్‌ఎన్‌ఎల్‌ అనకాపల్లి శాఖలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేసే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక దేశభక్తి గీతాలు రాసే అలవాటు ఉన్న ఆయన అనేక కార్యక్రమాల్లో గీతాలు సైతం ఆలపించేవారు. 1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుసుకునే అవకాశం ఆయనకు లభించింది. సీతారామశాస్త్రి ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్‌ ఆయన చిత్రం సిరివెన్నెలలో పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. సినిమాలో ఆ పాటలకు మంచి గుర్తింపు లభించి సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా సుపరిచితమైంది. అనంతరం 3 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఎన్నో సందేశాత్మక గీతాలు రాసిన సిరివెన్నెల అద్వితీయమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు పద్మశ్రీ లభించడం పట్ల అనకాపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా హర్షతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు