పద్మ’వ్యూహం

6 Feb, 2016 01:39 IST|Sakshi
పద్మ’వ్యూహం

ఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టిన ముద్రగడ
అభిమానులకు పోలీసుల కట్టడి
అనుమానం వస్తే వెనక్కి మళ్లింపు
కిర్లంపూడి చుట్టూ ఐదంచెల సోదాలు
అడుగడుగునా బలగాల మోహరింపు
 ప్రతి ఒక్కరి ఫొటో, వాహనం నంబరు నమోదు

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :
 తీవ్ర ఉత్కంఠ నడుమ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, తన సతీమణి పద్మావతితో కలిసి కిర్లంపూడిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో  గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆయన దీక్ష ప్రారంభించే సమయానికి అభిమానులు కానీ, మరే ఇతర పార్టీల నాయకులు కానీ కిర్లంపూడి రాకుండా పోలీసులు కట్టడి చేశారు. కిర్లంపూడి ప్రధాన రహదారి వెంబడి ఐదంచెల తనిఖీల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ప్రతి వ్యక్తినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విడిచిపెట్టారు. ఒకవేళ వారు రాజకీయ నాయకులనో, ముద్రగడ అభిమానులనో ఏమాత్రం అనుమానం వచ్చినా వెనక్కి పంపించేశారు. చివరకు మీడియా ప్రతినిధులను కూడా గుర్తింపు కార్డులు చూపిస్తేనే కిర్లంపూడి వైపు పంపించారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరి ఫొటో, వాహనం నంబర్లను సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు.


 జిల్లావ్యాప్తంగా 39 తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తే.. వాటిలో సగం కిర్లంపూడికి వచ్చే మార్గాల్లోనే ఉన్నాయి. సామర్లకోట-ప్రత్తిపాడు రోడ్డులో ప్రతి గ్రామంలోనూ పోలీసు తనిఖీలు జరిగాయి. సామర్లకోట రోడ్డు ప్రారంభంలో బంతుల మేడ మొదలుకొని రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు, దివిలి, రాజుపాలెం, కిర్లంపూడి, జగపతినగరం పోలీస్ స్టేషన్, జగపతినగరం శివారులోని ప్రగతి స్కూల్, ప్రత్తిపాడు వరకూ తనిఖీల కోసం సాయుధ బలగాలను వినియోగించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి ఇరువైపులా భారీ సంఖ్యలో పోలీసులతోపాటు ఇండో - టిబెటన్ బోర్డర్ ఫోర్‌‌స (ఐటీబీఎఫ్), సెంట్రల్ రిజర్‌‌వ పోలీస్ ఫోర్‌‌స (సీఆర్‌పీఎఫ్), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్, అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్, ఓఎస్‌డీ శంకర్‌రెడ్డి ఎక్కువగా కిర్లంపూడిపైనే దృష్టి పెట్టారు. ఇక ముద్రగడ నివాసం వద్ద గురువారం సాయంత్రం నుంచే కట్టడి మొదలెట్టారు.


ప్రహరీ మెయిన్‌గేట్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. ప్రహరీ చుట్టూ అడుగడుగునా పోలీసులే కనిపించారు. అలాగే మఫ్టీ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు లు కార్యకర్తల్లో కలసిపోయి నిఘా ఉంచారు. ముద్రగడను కలసిన ప్రతి ఒక్క నాయకుడి పేరును, అక్కడి పరిణామాలను నమోదు చేసుకోవడంలో బిజీగా గడిపారు.

 సున్నిత ప్రాంతాలపై..
 తునిలో జనవరి 31న కాపు ఐక్యగర్జన సందర్భంగా విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం, గతంలో ముద్రగడ దీక్షల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. పోలీసులు పక్కా వ్యూహం అమలు చేశారు. దీక్షా వేదికగా నిలిచిన కిర్లంపూడి తరహాలోనే జిల్లాలోని సున్నిత ప్రాంతాలైన జగ్గంపేట, పిఠాపురం, తుని, అమలాపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి. భాష్పవాయువును ప్రయోగించే వాహనాన్ని సైతం కిర్లంపూడిలో సిద్ధం చేశారు. ఏ క్షణంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా తిప్పికొట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే ఇవి కిర్లంపూడిలో మితిమీరి కనిపించడంతో నాయకులే కాదు సాధారణ ప్రజలు సైతం ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో తన ఇంటి ప్రహరీ గేటు తీసి తన అభిమానులను, నాయకులను లోపలికి అనుమతించాలని ముద్రగడ పద్మనాభం జగ్గంపేట సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కేసుల నమోదు
 జిల్లా మొత్తం మీద సీఆర్‌పీసీ 144 సెక్షన్ , పోలీసు చట్టం సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని కొన్నిచోట్ల నిరసన ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు చేసినవారిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు