పద్మనాభరెడ్డి అంత్యక్రియలు

6 Aug, 2013 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి అంత్యక్రియలు సోమవారం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో నిర్వహించారు. పద్మనాభరెడ్డి చితికి ఆయన కుమారుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ నిప్పంటించారు. అంతకుముందు పద్మనాభరెడ్డి పార్థివదేహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఇంటి నుంచి ప్రారంభమైన పద్మనాభరెడ్డి అంతిమయాత్ర మధ్యాహ్నం ఈఎస్‌ఐ శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ ప్రజాగాయకుడు గద్దర్, వామపక్ష నాయకులు నివాళులర్పించారు. న్యాయవాదిగా పద్మనాభరెడ్డి ప్రజలకు అందించిన సేవలపై కరపత్రాలను ఓపీడీఆర్ కమిటీ సభ్యులు పంచారు.
 
 ఆయన సేవలు అజరామరం: ఐఏఎల్
 న్యాయవాద వృత్తిలో పద్మనాభరెడ్డి సేవలు అజరామరమని ఇండియన్ అసోిసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) కార్యనిర్వాహక అధ్యక్షుడు చలసాని అజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బి.ప్రభాకర్ పేర్కొన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి సంతాపసభ సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఐఏఎల్ ఆధ్వర్యంలో జరిగింది. న్యాయవాదిగా పద్మనాభరెడ్డి సేవలను అజయ్‌కుమార్ కొనియాడారు. న్యాయవాదుల హక్కుల కోసం కృషి చేశారని చెప్పారు. డబ్బు గురించి పద్మనాభరెడ్డి ఎప్పుడూ ఆలోచించలేదని, న్యాయం పక్షానే నిలిచారని వివరించారు. న్యాయవాదులు ఆయననొక మార్గదర్శిగా తీసుకొని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎస్.సత్యంరెడ్డి, విద్యాసాగర్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డిలతో పాటు ఒ.అబ్బాయిరెడి ్డ, చల్లా శ్రీనివాస్‌రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు